మతమార్పిడి నిషేద చట్టాన్ని రద్దు చేసిన సీఎం, ప్రధాని మోదీకి ఝలక్ ఇచ్చిన సిద్దూ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన మతమార్పిడుల నిషేధ చట్టాన్ని రద్దు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం విధానసౌదలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, ఆయన మంత్రి వర్గం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కర్ణాటక కేబినెట్ సమావేశం అనంతరం ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీఎంసీ చట్టాలను రద్దు చేస్తూ కేబినెట్ సమావేశం నిర్ణయించిందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం (బీజేపీ) చేసిన పాఠశాల పాఠ్య పుస్తక సవరణను రద్దు చేసి గతంలో ఉన్న పాఠ్యాంశాలను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి హెచ్ కే. పాటిల్ మీడియాకు చెప్పారు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీఎంసీ సవరణ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేసింది. దీంతో రైతులు నష్టపోగా, ఆధారపడిన వారు నష్టపోయారు. ఈ నేపథ్యంలో పాత ఏపీఎంసీ చట్టంలో కొన్ని మార్పులు చేసి వచ్చే మంత్రివర్గ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వంలోని కేబినెట్ నిర్ణయించింది.
పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలోనే పాఠ్యాంశాలను సవరించాలని, కన్నడ, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, నెహ్రూ, అంబేద్కర్, హెడ్గేవార్, సూలిబెలె తదితర పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు రద్దు చెయ్యాలని, లేదా మార్పులు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హెచ్ కే. పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఆయన మంత్రివర్గం మద్దతుతో ఇంకా ఎన్ని చట్టాలను మారుస్తారా ?, బీజేపీ అమలు చేసిన ఎన్ని చట్టాలను రద్దు చేస్తారు ? అనే విషయం ఇంకా కొంతకాలం వేచి చూడాలని కొందరు రాజకీయ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications