కర్నాటకలో బైక్ ట్యాక్సీల బ్యాన్ ..! హైకోర్టు కీలక ఆదేశాలు..!
కర్నాటకలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. బైక్ ట్యాక్సీల్ని (bike taxi) నిషేధిస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గతంలో సమర్థించారు. అయితే దీనిపై సమీక్ష జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బైక్ ట్యాక్సీవాలాలకు ఊరట లభించింది.
రాష్ట్రంలో బైక్ ట్యాక్సీల కారణంగా చోటు చేసుకుంటున్న అనర్థాలను నివారించేందుకు సిద్దరామయ్య నేతృత్వంలోని కర్నాటక సర్కార్ గతంలో వీటిపై నిషేధం విధించింది. అయితే దీన్ని బైక్ ట్యాక్సీ సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై తొలుత విచారణ జరిపిన సింగిల్ బెంచ్ సమర్థించినా ఇవాళ డివిజన్ బెంచ్ మాత్రం ఈ నిషేధాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులతో పాటు సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా రద్దయ్యాయి.

చట్టపరమైన అనుమతులకు లోబడి బైక్‌లను రవాణా వాహనాలుగా ఉపయోగించవచ్చని హైకోర్టు ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఓలా, ఉబర్‌తో సహా అగ్రిగేటర్లు దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కర్నాటక హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం బైక్ యజమానులు, అగ్రిగేటర్లు లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉఉన్న చట్టాలకు అనుగుణంగా వారికి పర్మిట్లను జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

కర్నాటకలో బైక్ ట్యాక్సీ సంస్థలైన రాపిడో, ఓలా, ఉబెర్ మోటోలపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో ఇవి చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ నిషేధం విధించారు. దీంతో బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లు నిషేధం ఎత్తేయకుంటే తమ జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని సీఎం సిద్దరామయ్యతో పాటు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అయినా నిషేధం ఎత్తేయకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.












Click it and Unblock the Notifications