మహర్షి హత్య కేసు సీబీఐకి ఇవ్వలేమని చెప్పిన హోమ్ మంత్రి !
బెంగళూరు/న్యూఢిల్లీ: జైన మహర్షి హత్య లాంటి సంఘటన జరిగినప్పుడు, ఎవరూ వివక్ష చూపలేరని, ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని, మా పోలీసులు సమర్థులని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. కర్ణాటకలోని హబ్బళి తాలూకాలోని వరూర్‌లో జైన ముని గుణధారా నంది మహారాజ్‌ను కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్. జీ. పరమేశ్వర్ కలిశారు.
మహారాజ్ ను కలిసిన అనంతరం హోమ్ మంత్రి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ జైన ముని కామకుమార నంది మహరాజ్ హత్యకు కారకులైన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు. జైన ముని కామకుమార నంది మహారాజు హత్య విచారణలో జాప్యం జరుగుతోందని, సక్రమంగా విచారణ జరగడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఈ విషయాలు తనను కలవరపెట్టిందని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ జైన మహర్షి కామకుమార నంది మహారాజ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనపై కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ నిందితులను పట్టుకునే సత్తా మన కర్ణాటక పోలీసు శాఖకు ఉందని అన్నారు. కేసు విచారణ దర్యాప్తు ప్రారంభమైందని, ఈ కేసు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి పరమేశ్వర్ అన్నారు.
ఈ కేసులో కర్ణాటక పోలీసు శాఖ విచారణ ముగిసిన తర్వాత అసలు విషయం తేలనుందని, ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రభుతం మీద, పోలీసు శాఖ మీద ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జైన మునిని హత్య చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తెలిపారు.

కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఎన్నికపై బీజేపీ ఎందుకు ఆలస్యం చేస్తోందని మీడియా అడిగిన ప్రశ్నకు హోమ్ మంత్రి పరమేశ్వర్ సమాధానం ఇచ్చారు. బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతోందని, ప్రతిపక్ష నేతను ఇంకా ఎంపిక చెయ్యలేదని, అసెంబ్లీ ప్రారంభమై వారం రోజులు గడిచినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు లేకుండా సభ నడుస్తోందని, ప్రతిపక్ష పార్టీ అధినేతను ఇంకా ఎంపిక చేయకపోవడంతో బీజేపీ అంతర్గత కలహాలు బయటపడ్డామని, బీజేపీ తీరుతో ప్రజల మీద ఆ పార్టీకి ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications