కర్నాటకలో జేడీఎస్ ఆశలు గల్లంతు, కాంగ్రెస్ వ్యూహం రివర్స్: బీజేపీ చేతికి 21వ రాష్ట్రం
బెంగళూరు: కర్నాటకలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. దక్షిణాదిన అడుగు పెట్టాలన్న ఆ పార్టీ కల తిరిగి నెరవేరింది. ప్రస్తుతం కమలం పార్టీకి దక్షిణాదిన ప్రాతినిథ్యం లేదు. గతంలో కర్నాటకలో మాత్రమే గెలిచింది. మిగిలిన కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తదితర చోట్ల బీజేపీ ఎప్పుడూ సత్తా చాటలేదు.
Recommended Video

దీంతో గతంలో పోగొట్టుకున్న కర్నాటక నుంచే తిరిగి తన దక్షిణాది ప్రభంజనాన్ని ప్రారంభించింది. మే 12వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం (మే 15) జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకొచ్చింది. చాలా సర్వేలు హంగ్ వస్తాయని తేల్చాయి. ఒకటి రెండు మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలకు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని తేల్చి చెప్పాయి.

బీజేపీ ఖాతాలో 21వ రాష్ట్రం
మధ్యాహ్నం పదకొండు గంటల సమయానికి బీజేపీ 4 స్థానాల్లో గెలుపొంది, 116 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలుపొంది, 58 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 41 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఇతరులు రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ గెలుపు ద్వారా బీజేపీ తన ఖాతాలో 21వ రాష్ట్రాన్ని వేసుకుంది. 2014కు ముందు బీజేపీ నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండగా, ఇప్పుడు ఏకంగా 21 స్థానాలకు ఎగబాకింది. ఇందుకు నరేంద్ర మోడీ హవా, అమిత్ షా వ్యూహాలు, బీజేపీ కార్యకర్తల నిబద్దత-చిత్తశుద్ధి కలిసి వచ్చాయని అంటున్నారు.

జేడీఎస్ ఆశలు అడియాసలు
కర్నాటకలో హంగ్ వస్తుందని మొదటి నుంచి ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ అనూహ్యంగా బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. హంగ్ వస్తుందని భావించి జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్ వెళ్లి మరీ మంతనాలు జరిపారు. హంగ్ వస్తే కింగ్ లేదా కింగ్ మేకర్ అవుదామని భావించారు. కుమారస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుందని భావించారు.

ఓటమి తెలిసి కాంగ్రెస్ కొత్త వ్యూహం
మే 12న జరిగిన ఓటింగ్ సరళితో సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అయితే హంగ్ వస్తుందని భావించారు. అందుకే జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందుకే తెరపైకి దళిత సీఎం అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు పట్టించుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. తాము రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశామని చెబుతున్నారు. కానీ అటు జేడీఎస్ అంచనాలు, ఇటు కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. అంతేకాదు, లింగాయత్‌లను చీల్చి రాజకీయంగా నెగ్గాలనుకున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని కర్నాటక ప్రజలు తిప్పికొట్టారు.

ఏ ప్రాంతంలో ఎలా?
బాంబే కర్నాటక ప్రాంతంలో 50 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 32, కాంగ్రెస్ 14, జేడీఎస్ 2 స్థానాల్లో సత్తా చాటారు.
హైదరాబాద్ -కర్నాటకలో 40 అసెంబ్లీస్థానాలు ఉండగా బీజేపీ 20, కాంగ్రెస్ 16, జేడీఎస్ 4 స్థానాల్లో సత్తా చాటింది.
బెంగళూరు సిటీలో 26 స్థానాలు ఉండగా బీజేపీ 13, కాంగ్రెస్ 10, జేడీఎస్ 3 స్థానాల్లో సత్తా చాటింది.
కోస్టల్ కర్నాటకలో 19 నియోజకవర్గాలు ఉండగా బీజేపీ 16, కాంగ్రెస్ 2, జేడీఎస్ 1 స్థానంలో సత్తా చాటాయి.
పాత మైసూరు 55 స్థానాలలో జేడీఎస్29, కాంగ్రెస్ 12, బీజేపీ 12 స్థానాల్లో సత్తా చాటింది.
మధ్య కర్నాటకలోని 32 స్థానాల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 8, జేడీఎస్ 6 స్థానాల్లో సత్తా చాటింది.












Click it and Unblock the Notifications