వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kashmir Apple: ఇరాన్ కశ్మీర్ ఆపిల్ రైతుల పొట్ట కొడుతోందా, స్థానిక రైతుల్లో భయాలు ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లో ఆపిల్ దిగుబడులు ఈసారీ కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ, మార్కెట్లో ఆపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది.

శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో ఆపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది.

హైవేపై ఎక్కువ సమయం పడుతుండడంతో ఆపిల్స్ మండీలకు కుళ్లిపోయి లేదంటే పనికిరాని స్థితిలో చేరుకుంటున్నాయి. దీంతో వాటి ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.

కానీ, ప్రస్తుతం మార్కెట్లో కశ్మీర్ ఆపిల్ ధర భారీగా ప్రధాన కారణం ఇదొక్కటే కాదు. కశ్మీర్ ఆపిల్ ధర పతనం కావడానికి ఇరాన్ నుంచి వస్తున్న ఆపిళ్లే అసలు కారణమని కశ్మీర్ రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

నిజానికి, గత ఏడాది నుంచీ భారత మార్కెట్లోకి ఇరాన్ ఆపిల్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచీ కశ్మీర్ ఆపిల్ రైతులు, వ్యాపారుల జీవితాల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఇరాన్ ఆపిల్ గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తం చేసిన కశ్మీర్ ఆపిల్ వ్యాపారులు, రైతులు.. భారత ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కూడా కోరారు.

శ్రీనగర్‌లోని పరింపోరా పండ్ల మార్కెట్‌లో తన ఆపిల్స్ పెట్టెలు సర్దుతున్న రైతు ఫారూఖ్ అహ్మద్ రాఠేర్ కుటుంబం, హార్వన్ ప్రాంతంలో దశాబ్దాల నుంచి ఆపిల్ సాగు చేస్తోంది.

ఇరాన్ నుంచి భారత్ దిగుమతి అయ్యే ఆపిళ్ల వల్ల మార్కెట్లో తమ పండ్లకు మార్కెట్ లేకుండా పోతోందని ఆయన చాలా ఆందోళనగా ఉన్నారు. తన తోటలో దాదాపు 4 వేల పెట్టెల ఆపిళ్లు ఉత్పత్తి చేస్తానని ఫారూఖ్ అహ్మద్ చెబుతున్నారు.

"ఇరాన్ నుంచి ఆపిల్స్ కస్టమ్ డ్యూటీ చెల్లించకుండానే భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మేం చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా సరుకులపై కస్టమ్ డ్యూటీ ఉన్నట్లే, ఇరాన్ ఆపిళ్లపై కూడా ఉండాలి. పన్నుల వేస్తే, ఇరాన్ నుంచి వచ్చే ఆపిళ్లు తక్కువ ధరకు రావు. మన మార్కెట్లో చౌకగా కూడా దొరకవు. అలా మన ఆపిళ్లకు మంచి ధర కూడా వస్తుంది" అన్నారు ఫారూఖ్.

నరేంద్ర మోదీ

ప్రధాని మోదీకి రైతుల లేఖ

కశ్మీర్ రైతులు, వ్యాపారుల సంస్థ 'ద కశ్మీర్ వ్యాలీ ఫ్రూట్ గ్రోయర్స్-డీలర్స్ యూనియన్' గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. అఫ్గానిస్తాన్, దుబాయ్ నుంచి దేశంలోకి వచ్చే ఇరాన్ ఆపిళ్లపై వెంటనే నిషేధం విధించాలని కోరింది.

"ఇరాన్ ఆపిళ్లు భారత మార్కెట్లోకి రాకుండా అడ్డుకోకపోతే, జమ్ము-కశ్మీర్, హిమాచల్ నుంచి ఆపిల్ సాగుపై ఆధారపడిన రైతులందరూ భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్ ఆపిళ్ల వల్ల స్థానిక రైతులు సర్వనాశనం అవుతారు. సీజన్ ముగిశాక కూడా ఆపిళ్లను విక్రయించి మంచి లాభాలు సంపాదించేలా కశ్మీర్ పేద రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీలో ఉంచుతారు. కానీ, ఆ సమయంలో ఇరాన్ ఆపిల్స్ మార్కెట్‌ను ముంచెత్తడం వల్ల కశ్మీర్ ఆఫిల్ ధరలు పడిపోతున్నాయి" అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

కశ్మీర్ పండ్ల ఉత్పత్తి సంఘాలు ఏమంటున్నాయి

'ద కశ్మీర్ వ్యాలీ ఫ్రూట్ గ్రోయర్స్-డీలర్స్ యూనియన్' అధ్యక్షుడు బషీర్ అహ్మద్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. గత ఏడాదిగా ఇరాన్ నుంచి వస్తున్న ఆపిల్స్, భారత మార్కెట్లో చాలా భారీ స్థాయిలో వ్యాపించాయని ఆందోళన వ్యక్తం చేశారు.

"కశ్మీర్లో ఆపిల్ ధరలు నిజానికి గత ఏడాది నుంచే పడిపోయాయి. గత ఏడాది దీపావళి తర్వాత ఇరాన్ ఆపిళ్లు భారత్‌లోకి రావడం మొదలైంది. అవి అంతకు ముందు కూడా వచ్చేవి. కానీ, అది తక్కువ కావడంతో మన పంటపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు. మా పంట తక్కువైనా, మంచి ధర వచ్చేది. కానీ, గత ఏడాది ఇరాన్ నుంచి ఆపిల్స్ భారీగా రావడంతో మన ఉత్పత్తుల ధరపై ప్రతికూల ప్రభావం పడింది" అన్నారు బషీర్.

ఈ ఏడాది ఇక్కడ ఆపిళ్ల దిగుబడి కూడా గత ఏడాది కంటే బాగా పెరిగినా, ఇరాన్ నుంచి ఆపిల్స్ ఇలాగే వస్తుంటే, కశ్మీర్ ఆపిల్ రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారాయన.

ఇరాన్ ఆపిళ్లు ఇంతకు ముందు అఫ్గానిస్తాన్, దుబయి నుంచి భారత్‌లోకి వచ్చేవి. కానీ ఇప్పుడివి వాఘా బోర్డర్ నుంచి కూడా వస్తున్నాయని బషీర్ అహ్మద్ చెప్పారు. అవి వాఘా ద్వారా భారత్‌లోకి ఎలా వస్తున్నాయో తమకు తెలీడం లేదన్నారు.

"కశ్మీర్ వ్యాపారులు పన్నులు చెల్లిస్తున్నా, ఇరాన్ నుంచి వచ్చే ఆపిల్స్ ట్యాక్సులు చెల్లించకుండానే మన దేశంలోకి వస్తున్నాయి. ఇరాన్ ఆపిల్స్ వల్ల కశ్మీరీ ఆపిల్స్ ధర పడిపోవడమే కాదు, హిమాచల్ ఆపిల్స్ ధరలు కూడా పతనమయ్యాయి" అని బషీర్ తెలిపారు.

ఇరాన్ ఆపిళ్లు ఇలా మార్కెట్లోకి చేరుకోవడాన్ని కశ్మీర్ సంఘాలు వ్యతిరేకించాయి. భారత వ్యవసాయ మంత్రిని కూడా కలిశాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

రైతుల్లో ఆందోళన, నేతల్లోనూ చింత

"గత ఏడాది ఇరాన్ ఆపిల్ గురించి విన్నప్పుడే, మాకు మా ఆపిల్ పరిశ్రమ ప్రమాదంలో పడినట్టు అనిపించింది" అన్నారు కుల్గామ్‌కు చెందిన మరో ఆపిల్ రైతు షబ్బీర్ అహ్మద్ డార్.

షబ్బీర్ అహ్మద్ తోటల్లో ప్రతి ఏటా మూడు నుంచి, నాగులు వేల డబ్బాల ఆపిల్స్ దిగుబడి ఉంటుంది. ఇరాన్ ఆపిళ్లపై నిషేధం విధించకపోతే, కశ్మీర్ రైతులు భవిష్యత్తులో ఆపిల్ సాగునే మానేస్తారేమోనని ఆయన ఇప్పుడు భయపడుతున్నారు.

"ఇరాన్ ఆపిళ్లు మాకు నూటికి నూరు శాతం నష్టం తీసుకొస్తున్నాయనే విషయం, మాకు గత ఏడాది మరింత స్పష్టంగా తెలిసింది" అంటున్నారు షబ్బీర్.

ఇరాన్ నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్న ఆపిళ్ల గురించి కశ్మీర్‌లోని వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇరాన్ ఆపిళ్లపై కస్టమ్ ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నబీ డార్ డిమాండ్ చేశారు.

కశ్మీర్లో దాదాపు మూడు కోట్ల కశ్మీర్ ఆపిల్స్ బాక్సులు అలాగే ఉండిపోయాయి, ఇరాన్ ఆపిళ్లు మార్కెట్‌ను ముంచెత్తడంతో అవి అమ్ముడు కాకుండాపోయాయని ఆయన ఇదే ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు.

ఉత్పత్తి పెరిగింది, ధరలు కాదు

మార్కెట్లో ఆపిల్ ధరలు ఇప్పటికీ పెరగలేదని చాలామంది రైతులు చెబుతున్నారు.

"మార్కెట్ చాలా డౌన్ నడుస్తోంది. గత ఏడాది మార్కెట్లో వెయ్యి రూపాయలకు అమ్మిన ఒక ఆపిల్స్ పెట్టె ఈ ఏడాది 650 రూపాయలకే దొరుకుతోంది. బతుకు తెరువు కోసం పూర్తిగా ఆపిల్ సాగునే నమ్ముకున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. వారి ఏడాది ఖర్చంతా ఆపిల్ అమ్మడం వల్ల వచ్చే సంపాదనమీదే ఆధారపడి ఉంటుంది" అని ఫారూఖ్ అహ్మద్ రాఠేర్ అన్నారు.

"ఆపిళ్ల ప్యాకింగ్ ధర 30 నుంచి 40 శాతం పెరిగింది, కానీ ఆపిళ్ల ధర మాత్రం పెరగలేదు. అంటే దాని ఉత్పత్తి ఖర్చులు మాత్రం పెరిగాయి. కానీ పండ్లకు మాత్రం సరైన ధర రావడం లేదు. భారత మార్కెట్లలో ఇరాన్ ఆపిళ్ల పెత్తనం మొదలైంది. ఇది ఆందోళనకరమే కాదు, ఒక హెచ్చరిక కూడా" అని చెబుతున్నారు.

ఉత్పత్తి పెరగడం వల్ల కూడా తగ్గిన ధరలు

2021తో పోలిస్తే, ఈ ఏడాది కశ్మీర్లో ఆపిళ్ల దిగుబడి 25 నుంచి 30 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది కశ్మీరీలు వరి పొలాల్లో కూడా ఆపిల్ తోటలు పెట్టడం మొదలుపెట్టారు. వరి సాగు వల్ల పెద్దగా లాభాలు లేకపోవడం వల్లే, ఆఫిల్ తోటలు పెట్టడం ప్రారంభించామని చెప్పుకున్నారు.

2015లో జమ్ము-కశ్మీర్‌లో అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ 'హై డెన్సిటీ ఆపిల్ ప్రొడక్ట్‌'ను కశ్మీర్‌కు పరిచయం చేశారు. అప్పటి నుంచి అక్కడి రైతులు హై డెన్సిటీ తోటలు పెట్టడం ప్రారంభించారు.

ఈ హైడెన్సిటీ ఆపిల్ చెట్లు చాలా తక్కువ సమయంలోనే పంట దిగుబడి ఇవ్వడం ప్రారంభిస్తాయి.

దిగుబడైతే పెరిగింది, కానీ దాని ఉత్పత్తి వ్యయం కూడా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారీ ఆ ఖర్చు రెట్టింపు అయ్యింది అంటారు బషీర్ అహ్మద్

"క్రిమి సంహారకాల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది ప్రభుత్వం కార్డ్‌బోర్డ్ మీద 12 శాతం జీఎస్టీ వేస్తే, ఈసారీ అది 18 శాతం అయ్యింది. ఒక వైపు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంటే, మరోవైపు దిగుబడి కూడా పెరిగింది. మార్కెట్లో ప్రతి రోజూ 500 ట్రక్కుల ఆపిల్స్ వస్తుంటే, వాటి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు ఆ ట్రక్కుల సంఖ్య 1500కు పైనే పెరిగింది. దాంతో డిమాండ్-సప్లయి నిష్పత్తి చెడిపోయి ధరలు కూడా తగ్గిపోయాయి" అన్నారు.

కశ్మీర్ ఆపిల్ పరిశ్రమ ఎంత పెద్దది

ప్రస్తుతం ఆపిళ్లతో నిండిన 1500 ట్రక్కులు ప్రతి రోజూ కశ్మీర్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మండీలకు చేరుకుంటున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య 3 వేలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

కశ్మీర్లో 80 శాతం జనాభా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆపిల్ పరిశ్రమలో ఉన్నారు. రాష్ట్రంలో ఈ పరిశ్రమ వల్ల లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

10 వేల కోట్ల కశ్మీర్ ఆపిల్ పరిశ్రమలో ఈసారీ 25 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. 2021లో కశ్మీర్ ఆపిల్ పరిశ్రమ 21 లక్షల టన్నుల ఆపిల్ ఉత్పత్తితో రికార్డు సృష్టించింది.

జమ్ము-శ్రీనగర్ హైవేపై నిలిచిపోయిన ట్రక్కులు

గత కొన్ని రోజులుగా తమ ట్రక్కులు శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై నిలిచున్నాయని, దీంతో మండీలకు చేరుకునేలోపే వాటి ధర మరింత పడిపోతోందని కశ్మీర్ ఆపిల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

జాతీయ రహదారులపై ట్రక్కులను నిలిపివేయడంపై కశ్మీర్ ఆపిల్ వ్యాపారులు ఇటీవల కశ్మీర్ మండీల్లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ప్రభుత్వం దీనిపై హామీలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ చేపట్టినట్లు కనిపించలేదని ఆ యూనియన్ చెబుతోంది.

మరోవైపు, ఆపిల్ ట్రక్కులకు వెళ్లడానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు.

అధికారులు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా హైవేపై ఆపిల్ ట్రక్కులను నిలిపివేస్తున్నారని, ఇరాన్ ఆపిళ్ల విషయంలో కేంద్రం ఏవైనా చర్యలు తీసుకుంటుందా అనేది తామేమీ చెప్పలేమని కశ్మీర్ జోన్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ గులామ్ రసూల్ మీర్ తెలిపారు.

నిజానికి, శ్రీనగర్-జమ్ము హైవేపై గత కొన్నేళ్లుగా మరమ్మతుల పనులు నడుస్తున్నాయి. దీనివల్ల పెద్ద ట్రక్కులను ఈ మార్గంలో ప్రతి రోజూ అనుమతించడం లేదు.

గత నాలుగేళ్లుగా కశ్మీర్ ఆపిల్ పరిశ్రమ వరుసగా నష్టాలు ఎదుర్కుంటూ వస్తోంది. 2019లో జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దు చేశాక, కశ్మీర్‌లో చాలా కాలం కార్యకాలాపాలు స్తంభించాయి. దీంతో రైతులు తమ తోటలను సరిగా చూసుకోలేకపోయారు. తర్వాత రెండేళ్లు ( 2020, 2021) కోవిడ్ వల్ల రైతుల ఆపిల్ పంటపై ప్రభావం పడింది.

ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అసలు ప్రమాదం మాత్రం ఇరాన్ ఆపిళ్ల వల్లే అంటున్నారు రైతులు. హైవేపై ట్రక్కులను నిలిపివేయడం, మిగతా సమస్యలన్నీ పరిష్కారం కావచ్చు. కానీ, ఇరాన్ ఆపిళ్లను అడ్డుకోకపోతే, కశ్మీర్ ఆపిల్ పరిశ్రమకు గడ్డు రోజులు ఎదురయ్యే రోజు ఎంతో దూరంలో ఉండదు" అంటూ హెచ్చరిస్తున్నారు షబ్బీర్ అహ్మద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kashmir Apple: Is Iran's Kashmir apple reason for suffers to farmers, why are local farmers afraid?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X