'సోలో లైఫే సో బెటరూ..' : మహిళల గురించి ఆయనేం చెప్పారంటే..!
న్యూఢిల్లీ : వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కేండయ కట్జు తాజాగా తన బ్లాగులో మహిళలపై వివాదస్పద రీతిలో స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. తనకు నచ్చినట్టు మాట్లాడడంలో ఎవరి అభిప్రాయాలను లెక్క చేయని కట్జు తరుచూ వివాదస్పద అంశాలతోనే వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు.
తాజాగా మంగళవారం నాడు 'మహిళలంగా దూరంగా ఉండండి.. బ్రహ్మచారిగానే బ్రతకండి' అంటూ మార్కేండేయ కట్జు తన బ్లాగు 'సత్యంభూయత్' లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. వివాదాలన్నింటికీ కారణం మహిళలే అని ఆరోపిస్తూ.. పురాణాల నుంచి ఇప్పటివరకు వివాదస్పదమైన మహిళల ప్రస్తావన గురించి చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగానే.. కైకేయి గురించి ప్రస్తావించిన ఆయన తన కుమారుడు భరతుడిని అయోధ్యకి రాజుగా పట్టాభిషేకం చేయమని కైకేయి కోరుండకపోతే, అసలు రాముడు 14ఏళ్ల వనవాసం వెళ్లడం, దశరథుడు బెంగతో మరణించడం, అనంతరం రామరావణ యుద్దం.. లంకా దహనం ఇవేవీ జరిగి ఉండేవి కాదని చెప్పుకొచ్చారు.
మేనక వల్లే బ్రహ్మర్షి విశ్వామిత్రకి కూడా తపోభంగమైందని ప్రస్తావించారు. ప్రస్తుత సమాజంలోని మహిళల వివాదాల గురించి కూడా పేర్కొన్న ఆయన అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ గురించి చెప్పుకొస్తూ.. మోనికా లివిన్ స్కీ కారణంగానే క్లింటన్ దాదాపుగా తన పదవికి దూరమైనంత పని జరిగిందని పేర్కొన్నారు.
అలాగే హెలెన్ అనే మహిళే లేకపోతే గ్రీకులకు, త్రోజన్స్ కి మధ్య యుద్దం జరిగుండకపోయేదని ఫలితంగా వందల మంది చనిపోయి ఉండకపోయేవారని కట్జు తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇలా.. ఇంకా చాలా మంది మహిళల గురించి రాసుకుంటూ వెళ్లిన ఆయన చివరిగా చెప్పిందేంటంటే.. 'తులసిదాస్ తను రాసిన రామచరిత్రమానస్ లో చెప్పినట్టు మహిళలకు దూరంగా బ్రహ్మచారిగా ఉండడమే బెటర్..' అని తేల్చేశారు.












Click it and Unblock the Notifications