బీజేపీలోకి మలయాళ హీరో సురేష్ గోపీ, పోటీ: మోడీదే ముహూర్తం
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ సినీ నటుడు సురేష్ గోపీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇటీవల సురేష్ గోపీ రాజకీయాల పైన తన ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలలో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారంటున్నారు. కేరళ రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనతో చర్చించారు.
ఆయన గురువారం నాడు బీజేపీలో చేరిక పైన మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. తాను ఎప్పుడు పార్టీలో చేరేది ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయిస్తారని, గణతంత్ర దినోత్సవం తర్వాత చేరిక ఉండవచ్చునని సురేష్ గోపీ చెప్పారు.

కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వీ మురళీధరన్ హీరోను పార్టీలోకి ఆహ్వానించారు. మూడు నెలల క్రితం సురేష్ గోపీ చేరిక పైన తాను జాతీయ పార్టీ నేతలతో అలాగే, హీరోతో మాట్లాడానని, ఇప్పుడు ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆయన ఎప్పుడు పార్టీలో చేరేది త్వరలో నిర్ణయమవుతుందని చెప్పారు.
కాగా, కేరళలో జరిగే ఎన్నికల్లో సురేష్ గోపీ ఓ స్థానం నుండి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. గతంలో మోడీ కేబినెట్లో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించారట. సురేష్ గోపీ కేరళలో అగ్రస్థాయి సీనియర్ నటుడు. ఆయన రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. విజింజమ్ కంటెయినర్ ట్రాన్షిప్ టెర్మినల్ ప్రాజెక్టు సాకారానికి హిందూ కమ్యూనిటి ముందుకు రావాలని ఇటీవల సురేష్ గోపీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications