అయ్యప్ప స్వాములకు కేరళ సర్కార్ బిగ్ అలర్ట్..!
కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు, ఇరుముడులు సమర్పించుకునేందుకు ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య కూడా వేల సంఖ్యలో ఉంటుంది. అయితే ఈసారి కేరళలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి వైద్యారోగ్యశాఖ ఇలా శబరిమలకు వచ్చే భక్తులకు ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
శబరిమలకు వస్తున్న అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ ఇవాళ పలు కీలక సూచనలు చేస్తూ బులిటెన్ విడుదల చేసింది.
ఇందులో రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ (అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ ) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది. దీంతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 04735203232ను సంప్రదించాలని సూచిస్తోంది.

ఎప్పటిలాగే ఈసారి కూడా శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు 'బ్రెయిన్ ఫీవర్' పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. కేరళలో తాజాగా ప్రమాదకరమైన ఈ మెదడు వాపు అమీబా కారణంగా వ్యాధి ప్రబలుతోందని హెచ్చరించింది. దీనిని 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' ఫీవర్ అని అంటారని తెలిపింది. దీని బారిన పడకుండా ఉండాలంటే నీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

ముఖ్యంగా అయ్యప్ప భక్తులు శబరిమల సన్నిదానంలోని నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది. సాధారణంగా ఇక్కడ నీటిలో నెగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ అమీబా నీటిలో వీరు మునిగినప్పుడు ముక్కు ద్వారా మెదడుకు చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతోంది. కాబట్టి అయ్యప్ప భక్తులు నీటిలో దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications