మిస్టరీ: బతికుండగానే.. చనిపోయినట్టు ప్రకటించుకున్నాడు, ఆ తర్వాత నుంచీ కనిపించడం లేదు!
ఓ వ్యక్తి బతికుండగానే తాను మరణించినట్లుగా తనకి తానే దినపత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ మర్నాటి నుంచే అదృశ్యమైపోయాడు. పోలీసులను సైతం ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
కేరళ: ఓ వ్యక్తి బతికుండగానే తాను మరణించినట్లుగా తనకి తానే దినపత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ మర్నాటి నుంచే అదృశ్యమైపోయాడు. పోలీసులను సైతం ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
అసలేం జరిగిందంటే... కేరళలోని కన్నూరు జిల్లా తలిప్పరంబ్ కుట్టిక్కోల్‌కి చెందిన జోసెఫ్ మెలిక్కున్నెల్(77) రూ.లక్షలు తగలేసి తాను మరణించినట్లుగా సంస్మరణ ప్రకటన ఇచ్చుకున్నాడు.

విచిత్రమేమిటంటే.. అతడు ఆ ప్రకటన ఇవ్వడానికి స్వయంగా ఆయా దిన పత్రికల కార్యాలయాలకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది అతడిచ్చిన ప్రకటనే చూశారుకానీ, అందులోని ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తే తమ వద్దకు వచ్చి ఆ ప్రకటన ఇస్తున్నాడని గ్రహించలేకపోయారు.
ఇంకేముంది, జోసెఫ్ ఇచ్చిన ప్రకటన ఆ మర్నాడే అన్ని దినపత్రికల్లో వచ్చేసింది. తెల్లవారగానే దినపత్రికలో జోసెఫ్ మరణించినట్లుగా ఉన్న ప్రకటన చూసి అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు అవాక్కయ్యారు.
అప్పటికే జోసెఫ్ అదృశ్యం కావడంతో అతడి ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతకీ జోసెఫ్ ఏమైనట్టు ? ఎక్కడికి వెళ్లినట్టు ? ఎందుకు తన గురించి తానే అలా చనిపోయినట్టుగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మరీ పత్రికలకి ప్రకటన ఇచ్చుకున్నాడు? ఇదే ఇప్పుడు పోలీసులకి అంతుచిక్కని మిస్టరీగా మారింది.
తన పేరు, తన ఫొటోతో జోసెఫ్ స్వయంగా ఇచ్చుకున్న సంతాప ప్రకటనలో.. అతడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ రీజనల్ క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొని ఉంది.
కానీ జోసెఫ్ కుటుంబ సభ్యులు మాత్రం అదంతా అబద్ధమని, అసలు ఆయనకు అలాంటి వ్యాధి ఉందనే విషయం తమకు కూడా తెలియదని చెబుతున్నారు. అంతేకాదు, జోసెఫ్ ఆ సంతాప ప్రకటనలో పేర్కొన్న రీజనల్ క్యాన్సర్ సెంటర్ నిర్వాహకులు కూడా.. అసలు ఆ పేరుతో తమ సెంటర్ లో ఎవరూ చికిత్స తీసుకోలేదని స్పష్టం చేశారు.
దీంతో తలపట్టుకోవడం పోలీసులు వంతయింది. అసలు జోసెఫ్ అలాంటి ప్రకటన ఎందుకిచ్చాడనేదానికంటే కూడా ముందు అతడెక్కడున్నాడో కనుక్కునేందుకు వారు నానా తిప్పలు పడుతున్నారు. సినీమాటిక్ గా ఉన్న ఈ కేసును వారు సీరియస్‌గా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications