అల్పపీడనం ఎఫెక్ట్: కేరళలో 17 వరకు భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్, రాత్రిపూట ట్రావెల్ బ్యాన్
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది; అక్టోబర్ 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Recommended Video
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలియజేసింది. అరేబియా సముద్రం ఆగ్నేయంలో, బంగాళాఖాతం ఆగ్నేయంలో లక్షద్వీప్ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

అక్టోబర్ 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రానున్న మూడు గంటల్లో కేరళలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కేరళలో భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపత్యంలో కొండ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణం పరిమితం చేయబడింది. సహాయక కార్యక్రమాల నిమిత్తం 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించబడ్డాయి.
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో రెండు రోజులు తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నందున, కేరళలో భారీ వర్షం కొనసాగుతుంది. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాలకు రాత్రి సమయంలో ప్రయాణాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రయాణ నిషేధం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది.
అన్ని జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం, తిరువనంతపురం మినహా 13 జిల్లాలు ఐఎండీ కార్యాలయం నుంచి భారీ వర్ష హెచ్చరికలను అందుకున్నాయి. సున్నితమైన ప్రాంతాలను గుర్తించిన అనంతరం వివిధ జిల్లాల్లో ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏదైనా దురదృష్టకర ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి వివిధ విభాగాలు, ఏజెన్సీలు కావాల్సిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 622 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి 27 సహాయక శిబిరాలకు తరలించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నందున మరిన్ని సదుపాయాలు కల్పించాలని వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నిరంతర వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడం వలన వరదలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి, ఇక్కడ ఆనకట్టలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
కేరళలోని కోజికోడ్, పాలక్కాడ్, మలప్పురం, వయనాడ్ వంటి పలు జిల్లాల కోసం అక్టోబర్ 15 వరకు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు ప్రకటించిన జిల్లాలలో వరుసగా చాలా ఎక్కువ, అధిక వర్షపాతాన్ని సూచిస్తాయి.












Click it and Unblock the Notifications