స్టాప్ లో ఆగకుండా వెళ్లిన రైలు- కిలోమీటర్ వెనక్కి వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకున్న వైనం..
కేరళలో తాజాగా ఓ అశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ స్టేషన్ లో ఆగాల్సిన రైలు పొరబాటున ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో అప్పటివరకూ అక్కడ సదరు రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు కాస్తా అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు. చివరికి రైలు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహంతో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.
తాము కొనుక్కున్న టికెట్ల డబ్బులు వెనక్కి ఇమ్మని కూడా కోరారు.
అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇలా ప్రయాణికుల్ని వదిలి వెళ్లిన రైలు మళ్లీ తిరిగి వెనక్కి వచ్చింది. ఆగాల్సిన స్టేషన్ లో ఆగకుండా కిలోమీటర్ ముందుకెళ్లిన రైలు తిరిగి ఏం జరిగిందో కానీ వెనక్కి వచ్చింది. కిలోమీటర్ వెనక్కి ప్రయాణించి మరీ ఆగాల్సిన స్టేషన్ కే తిరిగి వచ్చింది. దీంతో కాసేపు రైల్లో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలియలేదు. చివరికి ఆగాల్సిన స్టేషన్ లో ఆగకుండా ముందుకెళ్లింది కాబట్టి వెనక్కి వచ్చిందని వారు గ్రహించారు.

అలాగే అప్పటివరకూ రైలు తమ స్టేషన్ లో స్టాప్ ఉన్నా ఆగకుండా వెళ్లిపోయిందని ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు కూడా రైలు వెనక్కి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చివరికి రైలు స్టేషన్ కు వచ్చి ఆగడంతో తమ లగేజ్ తీసుకుని రైలు ఎక్కారు. దీంతో రైలు తిరిగి ప్రయాణం ప్రారంభించింది. ఈ ఘటన కేరళలోని చెరియనాడ్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా రైలు 8 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. అయినా లోకో పైలట్లు ఈసారి చాకచక్యంగా వ్యవహరించి ఆ టైమ్ ను కవర్ చేసేశారు.
ఈ ఘటనకు కారణమైన రైలు వేనాడ్ ఎక్స్ ప్రెస్. ఈ ఘటన సరిగ్గా ఉదయం 7.45కు చోటు చేసుకుంది. తిరువనంతపురం నుంచి ప్రయాణం ప్రారంభించిన వేనాడ్ ఎక్స్ ప్రెస్.. చెరియనాడ్ అనే ఓ డీ గ్రేడ్ స్టేషన్ లో స్టాప్ ఉన్నా ఆగకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకుని వెళ్లింది. దీంతో ఈ ఘటన కేరళలో చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications