యూనీలీవర్‌పై కత్తి గట్టిన తమిళ నటీనటులు
చెన్నై: బహుళ జాతి సంస్థ యూనీలీవర్‌పై తమిళ నటులు కత్తి గట్టారు. దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో జాతీయ ఉత్తమ నటుడు బాబీ సింహా కూడా చేరారు. రోహిణి, కలైరాణి వంటి తమిళ నటులు యూనీలీవర్‌కు వ్యతిరేకంగా గొంతెత్తారు. తాము కంపెనీకి చెందిన ఉత్పత్తుల్ని కొనబోమని, ఇతరులను కూడా ఈ దిశగా ప్రభావితం చేస్తామని చెప్పారు.
త్వరలోనే ‘వోంట్ బయ్ యూనీలీవర్' పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. తమిళనాడులోని ప్రముఖ హిల్ స్టేషన్ కొడైకెనాల్‌లో యూనీలీవర్‌కు థర్మామీటర్ ఫ్యాక్టరీ ఉండేది. అయితే దాని నుంచి విడుదలయ్యే పాదరసం వల్ల గాలి, నీరు కలుషితమై స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం దానిని నిషేధించింది.

అయితే ఆ స్థలాన్ని ఖాళీ చేసిన ఆ సంస్థ దాన్ని శుభ్రం చేయడం ఆపేసింది. ఆ చుట్టు పక్కల చాలా ప్రాంతాల్లో పాదరసం అలాగే నిలిచి ఉండిపోయింది. దానిని శుభ్రం చేయమని ఎంతగా చెప్పినా ఆ కంపెనీ పట్టించుకోలేదు.దీనిపై ఆగ్రహించిన బాబీసింహ, రోహిణి, కలైరాణి వంటి నటులు యూనీలీవర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించారు.
యూనీలీవర్‌కు చెందిన సంస్థ ఉత్పత్తులు కొనకూడదని. సినిమా హీరోలెవరూ వాటిని ఎండార్స్ చేయకూడదని, కొడైకెనాల్ ప్రజలకు మనం చేయగలిగిన సహాయం ఇదేనని వారు విజ్ఞప్తి చేశారు. ఇదే సమస్యపై సోఫియా ఆష్రఫ్ అనే విద్యార్థిని ఈ పరిశ్రమ చేస్తున్న అకృత్యాలపై గళమెత్తింది. తన వీడియోతో ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం కూడా చేసింది.












Click it and Unblock the Notifications