కృష్ణాజిల్లా నుంచి సుప్రీం ఛీఫ్ జస్టిస్ వరకూ- ఎన్వీ రమణ ప్రస్ధానం- కీలక తీర్పులివే
ఏపీలోని కృష్ణాజిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన నూతలపాటి వెంకట రమణ... తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. సొంత రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లోనే కాదు ఇప్పుడు యావత్ దేశంలోనే ఆయన పేరు మారుమోగుతోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆయన పేరును తన వారసుడిగా సిఫార్సు చేయడంతో జస్టిస్ రమణ భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. జస్టిస్ రమణ ఈ అత్యున్నత పదవి చేపట్టబోతున్న రెండో తెలుగువాడు మాత్రమే కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా నుంచి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ వరకూ ఆయన ప్రస్ధానం ఎలా సాగింది, ఆయన హయాంలో ఇచ్చిన కీలక తీర్పులపై స్పెషల్ రిపోర్ట్...

కృష్ణాజిల్లా పొన్నలూరులో జననం
నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. కృష్ణాజిల్లాలో ఉన్నత చదువుల తర్వాత 1983లో తొలిసారి న్యాయవాదిగా ఆయన బార్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత 2000 సంవత్సరంలో హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఆయన ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే జస్టిస్ రమణ జ్యుడిషియల్ అకాడమీ ఛైర్మన్‌గా, హైకోర్టు బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు జడ్డిగా
ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఛీఫ్ జస్టిస్‌గా పనిచేసిన అనుభవం ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను 2013 సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. మరుసటి ఏడాదే ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి వరించింది. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టులో శాశ్వత జడ్డిగా నియమించారు. దీంతో ఆయన దేశంలోని కీలకమైన న్యాయమూర్తుల్లో ఒకరిగా మారిపోయారు. ఆయనకు న్యాయశాస్త్రంతో పాటు సాహిత్యం, తత్వశాస్త్రంలో ఆసక్తి ఎక్కువని చెప్తుంటారు.

జస్టిస్ రమణ కీలక తీర్పులివే
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఈ ఆరు సంవత్సరాల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. అలాగే మరెన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిస్ ఎన్‌వి రమణ, సూర్య కాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంట్లో ఒక మహిళ పని విలువ ఆమె కార్యాలయానికి వెళ్లే భర్త కంటే తక్కువ కాదని అన్నారు. 2001 లో లతా వాధ్వా కేసులోనూ ఇంట్లో ఓ అగ్నిప్రమాదం జరిగినప్పుడు గృహిణికే ఎక్కువ పరిహారం ఇవ్వాలని ఆయన తీర్పునిచ్చారు. గతేడాది జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేయడంపై రాష్ట్ర అధికార యంత్రాంగం వివరణ ఇవ్వాలని జస్టిస్ రమణ, ఆర్ సుభాష్‌రెడ్డి, గవాయ్ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. గతేడాది కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణపై కమిటీని నియమిస్తూ ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2019లో రోజర్ మ్యాధ్యూ వర్సెస్ సౌతిండియా బ్యాంక్ కేసులోనూ ఎన్వీరమణతో పాటు మరో నలుగురు జడ్డీల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. 2017లో రాష్ట్రాలు ఆర్ధిక అంశాలపై చట్టాలు రూపొందించుకోవచ్చంటూ తీర్పునిచ్చిన 9 మంది జడ్డీల ధర్మాసనంలోనూ జస్టిస్ రమణ సభ్యుడే. 2016లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్ని బీజేపీకి అనుకూలంగా ముందుకు జరపాలన్న నిర్ణయాన్ని కొట్టేసిన సుప్రీం ధర్మాసనంలోనూ జస్టిస్ రమణ ఉన్నారు. 2016లో తమిళనాడు దేవాలయాల్లో అర్చకుల నియామకం అగామాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుందని తీర్పునిచ్చిన ధర్మాసనం లోనూ జస్టిస్ రమణ ఉన్నారు.