స్మార్ట్ సిటీలపై కెవిపి డౌట్: అవగాహన అవసరమన్న వెంకయ్య
న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కెవిపి మాట్లాడుతూ.. అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అంతేగాక, దానికున్న మార్గదర్శకాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు.
స్మార్ట్ సిటీలు ప్రకటించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటని, విశాఖను స్మార్ట్ సిటీ చేయడానికి అమెరికా ఎటువంటి సాయం చేస్తుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిబంధనలలో ఏమైనా సడలింపులు ఉంటాయా? అని కెవిపి రాజ్యసభలో అడిగారు.

కెవిపి ప్రశ్నలకు స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీల విధానానికి కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
స్మార్ట్ సిటీ అంటే ఏమిటి?, వాటిని ఎలా అభివృద్ధి చేస్తారన్న విషయాలపై స్పష్టత ఉంటే మంచిదేనని, కాకపోతే ఎంపీలకే ఈ విషయంపై ఇంకా అవగాహన లేకపోతే సాధారణ జనానికి ఏం తెలుస్తుందని అన్నారు. స్మార్ట్ సిటీల గురించి తెలుసుకోవాలని, అవగాహన అవసరమని పరోక్షంగా కెవిపికి వెంకయ్య సూచించారు.












Click it and Unblock the Notifications