
లఖింపూర్ ఖేరీ హింస: కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు బాధితులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా జైలు నుంచి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లఖింపూర్ ఖేరీ ఘటన బాధిత కుటుంబాలు సోమవారం ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఏఎన్ఐ కథనం ప్రకారం.. గత సంవత్సరం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన రైతుల కుటుంబాలు ఇప్పుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరీ హింస దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కార్ల కాన్వాయ్ చక్రాల కింద నలిగి రైతు సహా నలుగురు రైతులు చనిపోయారు. ఈ ఘటన ఓ జర్నలిస్టు ప్రాణాలను కూడా బలిగొంది.
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక కార్యక్రమం కోసం తేని స్వగ్రామానికి వచ్చినందుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఆ తర్వాత రైతులు ఆగ్రహంతో దాడులు చేయడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలతోపాటు ఓ డ్రైవర్ మరణించాడు.
కాగా, అంతకుముందు అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాది సలీల్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. రైతులను చంపిన వాహనంలో ఆశిష్ ఉన్నాడని పోలీసులు తమ నివేదికలో నిరూపించలేకపోయారని, పోలీసులు సరైన విచారణ చేయలేదని పేర్కొన్నారు. డిఫెన్స్ తరపున 192 అఫిడవిట్లు దాఖలు చేశామని, ఆశిష్ మిశ్రా సంఘటనా స్థలంలో లేరని పేర్కొన్నప్పటికీ, పోలీసులు తమ దర్యాప్తు, ఛార్జిషీట్‌లో అఫిడవిట్‌ను చేర్చలేదని ఆయన అన్నారు.
థార్ జీపును ఆశిష్ డ్రైవర్ హరిఓమ్ మిశ్రా పాడని, అతని వల్లే రైతులు మరణించారని చెప్పారు. తన క్లయింట్ నిర్దోషి అని, రైతులను చితకబాదేందుకు వాహన డ్రైవర్‌ను ప్రేరేపించినట్లు అతనిపై ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర మంత్రి కుమారుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీకే షాహి మాట్లాడుతూ.. ఘటన సమయంలో రైతులను చంపిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని తెలిపారు.