లఖింపూర్ ఖేరి హింసాకాండ: బీజేపీ కార్యకర్తలపై రైతుల దాడి "చర్యకు ప్రతి చర్య" మాత్రమే : రాకేష్ టికాయత్
లఖింపూర్ ఖేరి ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు బీజేపీ కార్యకర్తలపై, దాడికి పాల్పడటం చర్యకు ప్రతిచర్య మాత్రమేనని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన రైతులను తాము నిందితులుగా భావించటం లేదని రైతు సంఘం నాయకులు వెల్లడించారు.
లఖింపూర్ ఖేరిలో కాన్వాయ్ వాహనంతో దూసుకెళ్లి నలుగురు రైతుల ప్రాణాలు తీశారని, ఈ ఘటన అనంతరం జరిగిన ఘర్షణలో ఇద్దరు బిజెపి కార్యకర్తలను చంపడం చర్యకు ప్రతిచర్య మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. హత్యలకు పాల్పడిన రైతులు చేసింది తాను నేరంగా పరిగణించను" అని టికాయత్ తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనాన్ని ఎక్కించినందుకుగానే వారు ఈ విధంగా స్పందించినట్లుగా ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవడం లేదని, పేరుకు మాత్రమే సమన్లు ఇచ్చి మంత్రి కుమారుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని రైతు సంఘం నాయకులు ప్రకటించారు. ముందస్తు ప్రణాళికతో పన్నిన కుట్రగా లఖింపూర్ ఖేరి ఘటనను రైతు సంఘం నాయకులు అభివర్ణిస్తున్నారు. యూపీ ప్రభుత్వం దోషులకు రక్షణ కల్పిస్తుందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం లఖింపూర్‌పై కవాతు చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. అక్టోబర్ 18 న 'రైల్ రోకో' మరియు అక్టోబర్ 26 న లక్నోలో మహాపంచాయతీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. రైతు సంఘాల నాయకులు అజయ్ మిశ్రాను తొలగించాలని, ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరి దారుణ ఘటనకు బాధ్యుడని లఖింపూర్ ఖేరీ కేసులో ఎఫ్ఐఆర్‌లో హత్య నిందితుడిగా ఆయన పేరును పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని రాకేష్ టికాయత్ యూపీ ప్రభుత్వానికి వారం రోజుల నోటీసు ఇచ్చారు. శనివారం ఆశిష్ మిశ్రాను లఖింపూర్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications