వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఖీంపుర్ ఖేరీ హింసపై సిట్ రిపోర్ట్: రైతులను తొక్కించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర, కేంద్ర మంత్రి కొడుకుపై హత్య కేసు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లఖీంపుర్ ఖీరీ హింస చిత్రం

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాకాండ ప్రణాళికబద్ధంగా జరిగిన కుట్ర అని ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్, కోర్టుకు తెలిపింది.

అక్టోబర్ 3న లఖీంపుర్ ఖేరీలో వాహనాలతో తొక్కించి నలుగురు రైతులను, ఓ జర్నలిస్టును హతమార్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తైనీ కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మందిపై ఆరోపణలు ఉన్నాయి.

మంగళవారం ఆశిష్ మిశ్రాతోపాటు 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

సిట్ విచారణలో ఏం తేలింది?

ఈ కేసుపై సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో జరిపిన కుట్ర అని తేలింది.

"ఇప్పటివరకు దొరికిన సాక్ష్యాలు, దర్యాప్తును అనుసరించి ఇది నిర్లక్ష్యం లేదా అలక్ష్యంతో చేసిన నేరం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం చంపాలనే ఉద్దేశంతోనే చేశారని అని రుజువైంది. ఈ ఘటనలో అయిదురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి" అని లఖీంపుర్ ఖీరీ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు సిట్ రాసిన లేఖలో పేర్కొంది.

ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహా నిందితులందరిపై భారత శిక్షాస్మృతిలోని తీవ్రమైన సెక్షన్లను విధించాలని సిట్ సూచించింది.

ఈ సెక్షన్లలో "నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల గాయపరచడం, సెక్షన్ 307 (ఉద్దేశపూర్వకంగా హత్య), సెక్షన్ 326 (హత్య చేసే ఉద్దేశంతోనే ఆయుధాలు లేదా పరికరాలతో గాయపరచడం), ఆర్మ్స్ యాక్ట్ (ఆయుధాల చట్టం)" ఉన్నాయి.

SIT REPORT

ఆశిష్ మిశ్రాపై హత్య కేసు

ఆశిష్ అలియాస్ మోను మిశ్రాపై ముందే హత్య కేసును నమోదు చేశారు.

సిట్ దర్యాప్తులో కూడా ఆశిష్ మిశ్రా కుట్ర పన్ని హత్యలకు పాల్పడినట్లు తేలింది.

ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యంతో విచారణ ఊపందుకుంది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన సిట్‌ను విస్తరించి కోర్టు మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులను చేర్చింది.

హైకోర్టు మాజీ న్యాయమూర్తి సమక్షంలో న్యాయ విచారణ కూడా జరుగుతోంది.

lakhimpur kheri

కొడుకును కలిసేందుకు జైలుకు చేరుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తైనీ తన కుమారుడు ఆశిష్ మిశ్రాను కలిసేందుకు మంగళవారం లఖీంపుర్ ఖేరీ జిల్లా జైలుకు వెళ్లారు..

"నేను నా కొడుకును కలవడానికి వెళ్లాను" అని జైలు నుంచి బయటకు వస్తూ మీడియాతో చెప్పారు.

నిందితులందరినీ మంగళవారం కోర్టులో హాజరుపరిచి, సిట్‌ సిఫార్సులను విచారిస్తామని ప్రభుత్వం తరపున కోర్టులో హాజరైన అడిషనల్ ప్రాసిక్యూటింగ్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత కేసులో కొత్త సెక్షన్లను జోడించడంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

"నిందితులను కోర్టులో హాజరుపరిచి, దర్యాప్తు సిఫార్సులతో వేసిన పిటిషన్ వింటారు. విచారణకు సంబంధించిన పత్రాలు, సీడీలు కోర్టుకు అందిస్తారు. కొత్త సెక్షన్లపై రిమాండ్ గురించి నిర్ణయం తీసుకుంటారు" అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్పీ యాదవ్ తెలిపారు.

నిబంధనల ప్రకారం, సంఘటన జరిగిన తొంభై రోజుల్లోగా ప్రాసిక్యూషన్ వారు కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఆ తరువాత కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది.

జనవరి నెలలో చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

బీజేపీపై విపక్షాల దాడి

సిట్ సిఫార్సులు విన్న తరువాత ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై దాడి చేశాయి.

"కోర్టు ఆగ్రహం, మందలింపుతో ఇప్పుడు పోలీసులు కూడా రాష్ట్ర మంత్రి కుమారుడు కుట్ర ప్రకారమే రైతులను తొక్కించారని అంటున్నారు. ఈ కుట్రలో రాష్ట్ర హోంశాఖ మంత్రి పాత్ర ఏమిటనే దానిపై విచారణ జరగాలి. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను పదవి నుంచి కూడా తొలగించలేదు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.

"మోదీ జీ మళ్లీ క్షమాపణలు చెప్పే టైమ్ వచ్చింది. కానీ, ముందు నిందితుడి తండ్రిని పదవి నుంచి తొలగించండి. నిజం కళ్ల ముందు ఉంది" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

"లఖీంపుర్ ఘటనలో రైతులపై జీపు ఎక్కించినవారెవరో ఎవరికి తెలీదు! జీపులో ఉన్నవారెవరు, పక్కన కుర్చున్నవారెవరు, బీజేపీ కార్యకర్తలా కాదా అనేది ఎవరికి తెలీదు! లఖీంపుర్ ఘటన రైతులు మర్చిపోగలరా?" అని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.

lakhimpur kheri

లఖీంపుర్‌లో ఏం జరిగింది?

అక్టోబర్ 3న లఖీంపుర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తరువాత ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు.

డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు.

ఈ సమయంలో, టికునియా పట్టణంలో ఒక రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లింది.

ఒక రైతు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు.

మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మొహరించారు.

ఈ ఘటన తరువాత, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేతలంతా లఖీంపుర్ ఖేరీకి చేరుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వారిని అడ్డుకుంది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని సీతాపూర్ గెస్ట్ హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అఖిలేష్ యాదవ్ సహా ఇతర నేతలందరినీ లఖీంపుర్ చేరుకోకుండా అడ్డుకున్నారు.

అప్పటి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తైనీని సస్పెండ్ చేయాలని, ఆయన కుమారుడిపై తీవ్రమైన కేసులు పెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

లఖీంపుర్ ఖేరీ కేసును సుప్రీం కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరిపింది.

ఈ కేసులో జరుగుతున్న న్యాయ విచారణ వివరాలను తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి రామన్న నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Lakhimpurkheri violence:SIT submits the report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X