మోడీ ఎన్నారై: లాలూ ఆగ్రహం, అది కాదని మీడియాకు
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన విపక్ష నేతలు మాటల దాడి చేస్తున్నారు. మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం మోడీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా)గా మారిపోయారన్నారు.
నరేంద్ర మోడీ తరుచూ విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఆ దేశాలతో సత్సంబంధాల కోసం మోడీ వరుసగా విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూ ఆయన పర్యటనల పైన విమర్శలు గుప్పించారు. మోడీ ఇప్పుడు ఎన్నారై అయ్యారని ఎద్దేవా చేశారు.
మోడీ విదేశీ పర్యటనలను మీడియా కూడా అత్యుత్తమంగా చిత్రీకరిస్తోందని, విదేశాలలో ఆయనకు ప్రజాధరణ అంటూ చెబుతోందన్నారు. అదే సమయంలో దేశ సరిహద్దుల్లో ఉన్న సమస్యలను మాత్రం పక్కన పెట్టారన్నారు.
ఓ వైపు పాకిస్తాన్, చైనాలు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నాయని, దాడులకు, కాల్పులకు తెగబడుతున్నాయని, మోడీ మాత్రం విదేశాల్లో పర్యటిస్తున్నారని, దీనిని హైలెట్ చేయాలని మీడియాకు సూచించారు.

కాగా, మోడీ విదేశీ పర్యటనల పైన ఇటీవల విపక్ష నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రెండు రోజుల క్రితం ప్రధాని పైన మండిపడ్డారు. విదేశాల్లో మోడీకి వస్తున్న ప్రజాదరణ అంతా ఉత్తిదే అన్నారు.
సభలకు వస్తున్న వారిని బీజేపీ యంత్రాంగం సమీకరిస్తోందన్నారు. తను మయన్మార్‌లోని నైపిటాలో రెండుసార్లు పర్యటించానని, అక్కడి వీధుల్లో ఎవరూ కనిపించరని అంటూ, మోడీ కోసం ఒక్కసారిగా 20 వేలమంది ఎక్కడినుంచి వచ్చారని ప్రశ్నించారు.
ఈ స్పందన అంతా ఉత్తిదే అన్నారు. మోడీ తన వెంట తమ వారిని తీసుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. నన్ను నమ్మకుంటే ఫ్లైట్ టిక్కెట్లు చెక్ చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారట. అయితే, ఖుర్షీద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. అదంతా కాంగ్రెస్ దివాలాకోరుతనమన్నారు.












Click it and Unblock the Notifications