
లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల వయస్సు గల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీ వ్యాధి స్టేజీ -4 ఉంది. ప్రస్తుతం అవి 20 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయనకు బ్లడ్ షుగర్, రక్తపోటు స్థాయి హెచ్చుతగ్గులుగా ఉన్నాయని వెద్యులు తెలిపారు.
Recommended Video

దాణా కుంభకోణంలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది. రూ 60 లక్షల జరిమానా కూడా విధించింది. ఫిబ్రవరి 15న ఈ దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై కూడా కోర్టు విచారణ జరిపింది. వారిలో 46 మందికి మూడేళ్లు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. 24 మందిని నిర్దోషులుగా తుది తీర్పును వెల్లడించింది.