కాశీపై ఉత్కంఠ: మోడీ-కేజ్రీల్లో పైచేయి ఎవరిదో? సోదాలు
న్యూఢిల్లీ/వారణాసి: సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు వచ్చింది. సోమవారం దేశవ్యాప్తంగా చివరి మరియు తొమ్మిదో దశ లోకసభ ఎన్నికలు జరుగనున్నాయి. అందరి చూపు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి పైన ఉంది. ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెసు పార్టీ నేత అజయ్ రాయ్ బరిలో ఉన్నారు.
వారణాసిలో మోడీ గెలుపు దాదాపు ఖాయమని అందరు భావిస్తున్నారు. అయితే, కేజ్రీవాల్, అజయ్ రాయ్‌లు బిజెపి ప్రధాని అభ్యర్థి మెజార్టీని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారణాసి లోకసభ పరిధిలో పద్దెనిమిది లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. మోడీ మెజార్టీ తగ్గించాలని కాంగ్రెసు, ఎఎపిలు ప్రయత్నాలు చేస్తుండగా... మోడీకి రికార్డ్ మెజార్టీ ఇవ్వాలని బిజెపి అహర్నిషలు కష్టపడుతోంది.

మోడీయే టార్గెట్
వారణాసిలో ఇటు కాంగ్రెసు, అటు కేజ్రీవాల్‌తో పాటు దాదాపు అన్ని పార్టీల లక్ష్యం మోడీయే. కేజ్రీవాల్‌కు జెడి(యు) తదితర పార్టీలు మద్దతిస్తున్నాయి. జెడి(యు) ముఖ్యనేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... మోడీని ప్రధానిగా చూడవద్దని భావిస్తున్నారు. అలాగే బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వంటి వారు కూడా మోడీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మోడీని ఎలాగైనా ఓడించాలని ఎక్కువ మంది కేజ్రీవాల్‌కు మద్దతు పలుకుతున్నారు.
విపక్షాల పక్కా వ్యూహాన్ని గుర్తించిన బిజెపి కూడా అందుకు ధీటుగానే ముందుకు వెళ్తోంది. వారణాసిలో మోడీకి రికార్డ్ మెజార్టీ ఇవ్వాలని చూస్తున్న బిజెపి దాదాపు యాభై వేల మంది కార్యకర్తలను లోకసభ పరిధిలో దించిందట. వారంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎబివిపి, ఆరెస్సెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జోరుగా ప్రచారం నిర్వహించారు. మోడీ పెద్ద పెద్ద బహిరంగ సభల్లో పాల్గొంటుంటే... కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు.
కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా చిన్న చిన్న బహిరంగ సభలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. చిన్నా పెద్దా బహిరంగ సభలు కలిపి ఇప్పటి వరకు వారణాసిలో ఎక్కువ సభల్లో పాల్గొంది కేజ్రీవాలే. అసలైన పోటీ మోడీ, కేజ్రీవాల్ మధ్యేనని, కాంగ్రెసు అభ్యర్థి అజయ్ రాయ్ నామమాత్రపు పోటీ ఇస్తారని అందరు భావిస్తున్నారు. అజయ్ రాయ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మోడీ పైన పోటీ చేస్తున్నారు. ఆయన వర్గానికి చెందిన ఓటర్లు చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు.
అయితే ఆ ఓట్లు చీలుతాయని భావిస్తున్నారు. ఆ వర్గంలో దాదాపు సగం మంది మోడీ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. మోడీ పైన గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ పోటీ చేస్తానని తొలుత ప్రకటించారు. అయితే లౌకిక ఓటు చీలకూడదని తాను పోటీ చేయదల్చుకోలేదని ఆ తర్వాత చెప్పాడు. అతను ప్రస్తుతం ఘజియాబాద్ జైల్లో ఉన్నాడు. అతను కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతు తెలుపుతున్నాడు.
కృష్ణానంద్ రాయ్ అనే అతను ముక్తార్ అన్సారీ పన్నాగానికి బలయ్యారు. ఈ కృపానంద రాయ్ యూపిలో పేరు ప్రఖ్యాతలున్న అత్యంత ప్రభావవంతమైన భూమిహార్ నేత. దీంతో కాంగ్రెస్, బిజెపిలకు చెక్ చెప్పేందుకు బిజెపి కృష్ణానంద రాయ్ భార్యను బరిలోకి దింపి ప్రచారం చేయించారు. ఆమెతో పాటు పార్టీ సీనియర్ నేత సిపి ఠాకూర్‌చే ప్రచారం చేయించారు. వీరిద్దరి ద్వారా భూమిహార్ల ఓట్లు తమకు వస్తాయని బిజెపి భావిస్తోంది.
బిజెపి కార్యాలయంలో సోదాలు
రేపు (సోమవారం) చివరి విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోకసభకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక బిజెపి కార్యాలయంలో ఈసి అధికారులు, పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల పైన బిజెపి మండిపడింది. ఈసి అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications