నైపుణ్య భారత్ నిర్మిద్దాం: మోడీ, తొలిసారి, తప్పులుంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు తాను కొత్త వాడినని.. తప్పులుంటే క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బుధవారం జరిగిన లోకసభలో ఆయన ప్రసంగించారు. సభలో ఎందరో అనుభవజ్ఞులున్నారని, మల్లిఖార్జున ఖర్గే, ములాయం సింగ్ యాదవ్ లాంటి ఎందరో సీనియర్ల ప్రసంగాన్ని తాను విన్నానని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం తమకు కేవలం సంప్రదాయం కాదని, స్ఫూర్తిమంత్రమని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో చూపిన మార్గంలో చివరిదాకా కొనసాగుతామని ఆయన హామీ ఇచ్చారు. సభలో సభ్యులందరూ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులని ఆయన అన్నారు. ఇప్పటిదాకా 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదు కాబట్టి అనుమానాలు రావడం సహజమని, కానీ గుజరాత్ రాష్ట్రంలో తాము సాధించామని తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత సుస్థిర, అభివృద్ధి, సుపరిపాలన కోసం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నది విద్యావంతులు, ధనవంతుల కోసమే కాదని, పేదల కోసం నిలబడకపోతే మనల్ని ప్రజలు ఎన్నడూ క్షమించరని మోడీ అన్నారు. పేదలను పేదరికం నుంచి బయటకు తేవాల్సింది ప్రభుత్వమేనన్న మోడీ, పేదరికంపై పోరాడే మహత్తర ఆయుధం విద్య అని పేర్కొన్నారు. పేద ప్రజలందరికీ విద్యను అందించాలని మోడీ అన్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.
గ్రామాలకు 24 గంటల విద్యుత్, విద్య, పరిశ్రమలు అందిస్తే ఎవరూ వలస వెళ్లరని మోడీ పేర్కొన్నారు. పెరిగిన ధరలను తగ్గించి తీరతామని చెప్పారు. దేశంలో ఏ వ్యక్తీ ఆకలితో అలమటించరాదని అన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే అధిక లాభం సాధ్యమని ప్రధాని పేర్కొన్నారు. మహిళల గౌరవం, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని మోడీ తెలిపారు. అత్యాచారాలపై సొంత విశ్లేషణ చేయవద్దని ఆయన మంత్రులకు సూచించారు. అభివృద్ధిలో మన తల్లి, అక్కా చెల్లెల్ని భాగస్వాములు చేయాలంటే వారికి రక్షణ కల్పించాలని అన్నారు.
ఇప్పటి వరకు స్కామిండియాగా ఉన్న భారతదేశాన్ని స్కిల్డ్ ఇండియాగా(నైపుణ్య భారత్)గా మార్చాలని అన్నారు. ఇది ఎంతో సాహసంతో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమని చెప్పారు. అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ అవతరించిందని, ఇంతటి యువశక్తి ప్రపంచంలో ఒక్క భారత్‌కే సొంతమని అన్నారు. ఈ యువశక్తికి నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని గుర్తు చేశారు.
మహాత్మాగాంధీ నడిపిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు అభివృద్ధిని ప్రజల ఉద్యమంగా మారుద్దామని మోడీ అన్నారు. మరో ఐదేళ్లలో గాంధీ 150వ జయంతి జరుపుకోబోతున్నామని, ఆ నాటికి నిష్కళంక భారత్‌ను నిర్మించి మహాత్ముడికి బహుమతిగా ఇద్దామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 2022 నాటికి దేశంలోని ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరుద్దామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం తర్వాత లోకసభ నిరవధిక వాయిదా పడింది.


Click it and Unblock the Notifications