అన్సారీపై సంఘ్ ముప్పేట దాడి: ప్రాపకం కోసమన్న వెంకయ్య
మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ, ఆరెస్సెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆనవాయితీగా మారుతోంది.
న్యూఢిల్లీ/ హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ, ఆరెస్సెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆనవాయితీగా మారుతోంది. ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమా భారతి వంటి వారు ఆయన దేశానికేం చేశారని ప్రశ్నించారు.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నుంచి బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ మొదలు ఆరెస్సెస్ ప్రతినిధి ఇంద్రేశ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో హమీద్ అన్సారీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఇంతకు ఆయనపై వారెందుకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారో ఒకసారి చూద్దాం.. ఉపరాష్ట్రపతిగా వైదొలగడానికి ఒక రోజు ముందు హమీద్ అన్సారీ తన చివరి ఇంటర్వ్యూలో 'దేశంలోని ముస్లింలు అభద్రతాభావంతో ఆందోళనకు గురవుతున్నారు' అని వ్యాఖ్యానించారు.

అన్సారీ నుంచి చాలా నేర్చుకున్నామన్న మోదీ
దేశ వ్యాప్తంగా గోరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడిన వారిపై దాడులకు పాల్పడటం, హత్యలు చేయటంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే' అని హమీద్ అన్సారీ అన్నారు. ఇదిలా ఉండగా, అన్సారీ దిగిపోతున్న వేళ 'మీ నుంచి మేం చాలా నేర్చుకున్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
Recommended Video


అన్సారీ అతివాదిగా మారిపోయారని వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్య బయటకు రావడమే తరువాయి. సంఘ్ పరివార్ నేతలంతా మూకుమ్మడిగా హమీద్ అన్సారీపై విరుచుకు పడ్డారు. బీజేపీ మార్గదర్శి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ స్పందిస్తూ ‘ముస్లింలు ఏ దేశంలో సురక్షితంగా జీవిస్తున్నారో ఆ దేశానికి వెళ్లి జీవించొచ్చు' అని వ్యాఖ్యానించారు. ‘నేను ఆయన (అన్సారీ)కి ఒక వినతి చేస్తున్నా. ఈ దేశంలో ఆయన మాదిరిగా ముస్లింలు అభద్రతాభావంతో ఉంటే ఏ దేశంలో సురక్షిత వాతావరణం ఉంటే ఆ దేశానికి వెళ్లిపోవచ్చు' అని అన్నారు. అటువంటి వారిని అడ్డుకునే వారే లేరన్నారు. హమీద్ అన్సారీ వ్యాఖ్యలు దురద్రుష్టకరమని పేర్కొన్నారు. హమీద్ అన్సారీ వంటి వారి వ్యాఖ్యలకు దేశంలో మద్దతు తెలిపే వారే లేరని, దేశంలోని ముస్లింలు అంతా వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పదేళ్లపాటు ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అతివాదిగా మారిపోయారన్నారు.

రాజకీయాలు చేయనంటూనే ఫ్లేట్ ఫిరాయింపు
అంతకుముందు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టకముందు వెంకయ్య నాయుడు..హమీద్ అన్సారీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అన్సారీ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు. పదవీ విరమణ సమయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండగానే ఇలాంటి మాటలు సరికాదన్నారు. తాము ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాజ్యసభలో అన్సారీ ఉభయపక్షం వహిస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా 'ఆయన తప్పు చేశారు. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? కాదా అనేది నేను చెప్పలేను' తెలిపారు. రాజకీయ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. గమ్మత్తేమిటంటే ఉపరాష్ట్రపతిగా బాద్యతలు చేపట్టక ముందు హైదరాబాద్‌లో మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తాను రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. కానీ 24 గంటలు కూడా గడువక ముందే ప్లేట్ ఫిరాయించేశారు. అన్సారీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఆరోగ్యం బాగు చేసుకోవచ్చని పరేశ్ రావల్ వెటకారం
మరోపక్క, బీజేపీ కూడా అన్సారీ వ్యాఖ్యలు తప్పుపట్టింది. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఆయన రాజకీయ ఆశ్రయం కోరేందుకు ఇలా మాట్లాడినట్లుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శించారు. గుజరాత్ బీజేపీ లోక్‌సభ సభ్యుడు పరేశ్ రావల్ మాట్లాడుతూ హమీద్ అన్సారీ తన ఆరోగ్యం బాగా లేకపోతే చెక్ చేయించుకోవచ్చునని వెటకారం చేశారు. రెండేళ్ల క్రితం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ సర్కార్.. అందరికీ ఆహ్వానాలు పంపినా.. రాజ్యాంగపదవిలో ఉన్న హమీద్ అన్సారీ సంగతి మరిచిపోయింది. ఈ విషయమై మీడియా ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి ఉమా భారతి.. ఆయనకు ఆహ్వానం ఎందుకు పంపాలి? ఆయన జాతి హితం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications