లోన్ ఫ్రాడ్ కేసు: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త అరెస్ట్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. శుక్రవారం వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది.
వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా 2018లో చందా కొచ్చర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2012లో బ్యాంక్ సీఈవో హోదాలో రూ. 3250 కోట్ల రుణం మంజూరు చేయడం, అది ఎన్పీఏ(నిరర్ధక ఆస్తి)గా మారడంతో తద్వారా ఆమె కుటుంబ లబ్ధిపొందినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా, చందా కొచ్చర్ తోపాటు ఆమె భర్తను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

2012లో ఐసిఐసిఐ బ్యాంక్‌కి నిరర్థక ఆస్తిగా మారిన వీడియోకాన్ గ్రూప్‌కు ₹ 3,250 కోట్ల రుణంలో అవకతవకలు జరిగాయని.. నేరపూరిత కుట్ర, మోసం చేసినట్లు ఆమెపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
ఈ కేసులో అభియోగాల ప్రకారం.. వీడియోకాన్ గ్రూప్‌కు బ్యాంక్ రుణం మంజూరు చేసిన నెలల తర్వాత.. వీడియోకాన్ మాజీ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్, కొచ్చర్ స్థాపించిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.
కొచ్చర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ రుణాన్ని క్లియర్ చేసిందని సీబీఐ ఆరోపించింది. ఆమె తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, "వీడియోకాన్‌కు రూ. 300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుంచి తన భర్త ద్వారా అక్రమ ప్రయోజనం పొందింది' అని ఏజెన్సీ పేర్కొంది . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియోకాన్ పొందిన రూ. 40,000 కోట్ల రుణంలో ఇది భాగం .
కాగా, తాను ఎలాంటి తప్పు చేయలేదని చందా కొచ్చర్ అంటున్నారు.












Click it and Unblock the Notifications