Coronavirus: మళ్లీ లాక్ డౌన్ కావాలా ? అవ్వా బువ్వా రెండు కావాలంటే కుదరదు, మీ ఇష్టం, సీఎం వార్నింగ్ !
బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరులో రోజురోజుకు కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని, ఆ మహమ్మారిని అరికట్టడానికి మా వంతు కృషి మేము చేస్తున్నామని, ఇప్పుడు అంతా మీ చేతుల్లోనే ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సిలికాన్ సిటీ ప్రజలకు చెప్పారు. మీరు మళ్లీ లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నారా ? చెప్పండి, లేదా ప్రభుత్వం, అధికారులు చెప్పినట్లు వింటారా ? అది మీరే తేల్చుకోండి అని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప బెంగళూరు ప్రజలను ప్రశ్నించారు. కరోనా వైరస్ ను తాము శక్తివంచన లేకుండా కట్టడి చేశామని, అయితే మీరు చేస్తున్న పని ఏమిటి ? అని బెంగళూరు ప్రజలను సీఎం బీఎస్. యడియూరప్ప ప్రశ్నించారు. అవ్వా బువ్వా రెండు కావాలంటే కుదరదు, అది మీరే తేల్చుకోండి అని నిర్ణయాన్ని బెంగళూరు ప్రజలకు వదిలేశారు.

కరోనా దెబ్బకు బెంగళూరు హడల్
బెంగళూరు సిటీలో దాదాపు 1 కోటి 40 లక్షల మంది నివాసం ఉంటున్నారు. బీబీఎంపీ పరిధిలో మొత్తం 198 వార్డులు ఉన్నాయి. బెంగళూరు నగరంలో కన్నడిగులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ( ఆంధ్రులు), తమిళనాడు, కేరళ ఇలా అనేక రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే ఇదే వారంలో కరోనా వైరస్ బెంగళూరులో తాడవం చెయ్యడంతో స్థానిక ప్రజలు, ప్రభుత్వం హడలిపోతున్నది. బెంగళూరులో ఇప్పటి వరకు 1, 685 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స విఫలమై 78 మంది మరణించారు.

సీఎం మీటింగ్
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం బెంగళూరులోని కర్ణాటక ముఖ్యమంత్రి అధికారిక నివాసం కృష్ణలో సీనియర్ మంత్రులు, అధికారులతో సీఎం బీఎస్. యడియూరప్ప అత్యవసర సమావేశం నిర్వహించి బెంగళూరులో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అని అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

మీకు మళ్లీ లాక్ డౌన్ కావాలా ?
మంత్రులు, అధికారులతో సమావేశం పూర్తి అయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో ఇంత వరకు కరోనా కట్టడికి ప్రజలు అందరూ సహకరించారని గుర్తు చేశారు. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అనేక ప్రాంతాల ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదని, మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో నిబంధనలు గాలికి వదిలేసి తిరుగుతున్నారని, మీరు మళ్లీ లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నారా ? అని సీఎం బీఎస్. యడియూరప్ప బెంగళూరు నగర ప్రజలను ప్రశ్నించారు.

అవ్వా... బువ్వా రెండు కావాలంటే కదురదు
మీరు లాక్ డౌన్ కావాలని కోరుకుంటే ఇలాగే ప్రవర్తించండి, లేదంటే ప్రభుత్వం, అధికారులు చెప్పినట్లు అన్ని నియమాలు పాటించి కరోనా కట్టడికి సహకరించండి, అంతే కాని అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదని, భౌతిక దూరం పాటిస్తూ ప్రతిఒక్కరు ముఖాలకు మాస్కులు వేసుకుని పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకున్నప్పుడే బెంగళూరులో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి అవకాశం ఉంటుందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

ఇంకా డిసైడ్ కాలేదు, కాని డిసైడ్ చేస్తాం
బెంగళూరు నగరంలోని అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, వైద్యులతో శుక్రవారం సీఎం, బీఎస్ యడియూరప్ప అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు (అఖిల పక్షం) నేతలు పాల్గొంటున్నారు. బెంగళూరు మళ్లీ లాక్ డౌన్ విధించాలా ? వద్దా అని ఇంత వరకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించిన తరువాత బెంగళూరు లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications