చీకటి అధ్యాయం: వెంకయ్య, సభలోకి మార్షల్స్, 37-33
న్యూఢిల్లీ: పార్లమెంటు చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవార అన్నారు. దేశ ప్రజలను చీకట్లో పెట్టి లోకసభను కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు పైన చర్చ నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.

లోకసభ గ్యాలరీ, ద్వారాలు మూసివేత
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో లోకసభ గ్యాలరీ, ద్వారాలను మూసివేశారు. సభలో గందరగోళం మధ్యనే బిల్లు సవరణల పైన చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. సభలోకి స్పీకర్ మార్షల్స్‌ను పిలిచారు. దీనిని బట్టి సీమాంధ్రలో ఎంపీలు, కేంద్రమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సగం మంది సభ్యులు వెల్లోనే: సుజనా చౌదరి
లోకసభలో సగం మంది సభ్యులు వెల్లోనే ఉన్నారని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి సుజనా చౌదరి అన్నారు. సగం మందిని బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. కాగా, సీమాంధ్ర ఎంపీలకు సిపిఎం, తృణమూల్ ఎంపీలు మద్దతుగా నిలిచారు.
నాశనమవుతారు: శివ ప్రసాద్
కాంగ్రెసు పార్టీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని, వారు నాశనమవుతారని చిత్తూరు టిడిపి ఎంపి శివ ప్రసాద్ అన్నారు. తలుపులు వేసుకొని చర్చిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పార్లమెంటులో సభ్యులుగా ఉన్నందుకు సిగ్గపడుతున్నామన్నారు.
ప్రభుత్వం 37, బిజెపి 33
మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లుకు ప్రభుత్వం 37, బిజెపి 33 సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 37 సవరణల్లో 36 సవరణలకు లోకసభ ఆమోదం తెలిపింది.
తృణమూల్ వాకౌట్
తెలంగాణ ముసాయిదా బిల్లును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెసు పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications