జమిలి బిల్లుకు అనుకూలంగా లోక్ సభ-ఈ-ఓటింగ్ లో వెల్లడి-చర్చ తర్వాత జేపీసీకి..!
జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన రెండు బిల్లుల్ని ఇవాళ ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమిలి ఎన్నికల బిల్లుల్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనలకు దిగాయి. సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. అయితే ప్రభుత్వం జేపీసీకి పంపుతామని ప్రతిపాదించింది. దీన్ని కూడా విపక్షాలు వ్యతిరేకించాయి.
ఓ దశలో బిల్లులు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై డివిజన్ ఓటింగ్ కోరాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో లోక్ సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా.. వ్యతిరేకిస్తూ 198 మంది ఎంపీలు ఓటేశారు. అనంతరం జమిలి బిల్లుల్ని మరోసారి న్యాయమంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకూ లోక్ సభ వాయిదా పడింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ కొనసాగించనున్నారు.

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం తగినంత మెజార్టీ లేకపోవడంతో వీటిని జేపీసీకి పంపేందుకు ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపేందుకు సిద్దమని విపక్షాల నిరసనల మధ్యే హోంమంత్రి అమిత్ షా, న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. అయితే విపక్షాలు నేరుగా బిల్లులు వెనక్కి తీసుకోవాలని కోరడంతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఓటింగ్ లో మెజార్టీ ఎంపీలు బిల్లుల్ని జేపీసీకి పంపే విషయంలోనూ క్లారిటీ ఇచ్చేయడంతో చర్చ అనంతరం వీటిని జేపీసీకి పంపడం లాంఛనమే.












Click it and Unblock the Notifications