No-Confidence : అవిశ్వాసంపై చర్చకు ముహుర్తం ఖరారు-మూడురోజుల చర్చ తర్వాత ప్రధాని జవాబు..
పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై వరుసగా నిరసనలకు దిగుతున్న విపక్షాలు ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం రూపంలో ఎన్డీయే సర్కార్ ను ఇరుకునపెట్టబోతున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిత్యం మణిపూర్ పై ఉభయసభలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది. దీన్ని అంగీకరించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్చకు తేదీలు ఖరారు చేశారు.

మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ మౌనవ్రతాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు దీనిపై చర్చ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 8న మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ అల్లర్లకు కారణం, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, మహిళల నగ్న ప్రదర్శన వంటి అంశాలపై లోక్ సభ సుదీర్ఘంగా చర్చించబోతోంది. ఇందుకు తగ్గట్టుగా పార్టీల బలాబలాల ఆధారంగా వారి ఎంపీలు మాట్లాడేందుకు స్పీకర్ తగిన సమయం కూడా కేటాయించారు. చర్చ అనంతరం ఈనెల 10న ప్రధాని మోడీ సమాధానం చెబుతారు.
మణిపూర్ అంశంపై కేంద్రం మౌనంగా ఉండటంపై విపక్షాలు నిరసనలు చేపడుతుండటంతో వరుసగా ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల నిరసనతో కేంద్రం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు మాత్రమే సిద్ధమైంది. దీంతో రూల్ 267 కింద చర్చ చేపట్టాలని ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో విపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఇవాళ అవిశ్వాసంపై చర్చకు తేదీలు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు లేవు. ఇప్పటికే లోక్ సభలో భారీ మెజారిటీతో ఉన్న ఎన్డీయేకు తోడు వైసీపీ, బీజేడీ వంటి తటస్ధ పార్టీల మద్దతు కూడా కేంద్రానికి ఉంది. దీంతో కేవలం ప్రధాని మోడీతో మణిపూర్ పై సమాధానం చెప్పించే లక్ష్యంతో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ చర్చ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే ప్రకటన ఆధారంగా విపక్షాలు తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నాయి.












Click it and Unblock the Notifications