బడ్జెట్: ఫీజులు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గాలి.. ఉద్యోగాలు రావాలి: యువత మనోగతం
చదువుల ఫీజులు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరల తగ్గంపు, ఉద్యోగాల కల్పన.. ఇవే భారతీయ యువత తాజా కేంద్ర బడ్జెట్ లో కోరుకుంటున్న అంశాలు.
న్యూఢిల్లీ: చదువుల ఫీజులు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరల తగ్గంపు, ఉద్యోగాల కల్పన.. ఇవే భారతీయ యువత తాజా బడ్జెట్ లో కోరుకుంటున్న అంశాలు. డిజిటల్ ఇండియాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే.
నగదు రహిత లావాదేవీల దిశగా ప్రోత్సహించేందుకు పెద్దనోట్ల రద్దు చర్య కూడా తోడ్పడింది. ఫలితంగా ఇప్పుడు అత్యధికులు ఆన్ లైన్.. ముఖ్యంగా మొబైల్ చెల్లింపులకు ఆసక్తి చూపుతున్నారు.
వివిధ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులన్నీ దాదాపుగా మొబైల్ యాప్ ల ద్వారానే జరిగిపోతున్నాయి. ప్రజలను ఈ దిశగా మరింత ప్రోత్సహించేందుకు మొబైల్ ధరలు తగ్గేలా తాజా బడ్జెట్ లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని యువతరం కోరుతోంది.

ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిర్వహించిన ఓ సర్వేలో విద్యార్థులు, వృత్తి నిపుణులు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. బడ్జెట్ లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉన్నత చదువులు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరల తగ్గంపు ద్వారా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డిజిటల్ ఇండియా కల నెరవేరుతుందని వారు అభిప్రాయపడ్డారు.
దేశ జనాభాలో 29 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు 47.8 శాతం మంది ఉన్నారు. మరోవైపు వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మంది భారతీయులు కార్యక్షేత్రంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
వారణాసికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అంకిత్ మిశ్రా మాట్లడుతూ.. 'బడ్జెట్ లో కేటాయింపులు విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు చాలామంది విద్యార్థులకు కష్టంగా ఉంటోంది. ఫీజుల భారాన్ని వారు మోయలేకపోతున్నారు..' అని పేర్కొన్నాడు.
'ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టిన డిజిట్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరింత తగ్గాలి. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పుడే డిజిటల్ ఇండియా కల సాకారమవుతుంది..' అని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన మోహిత్ శర్మ అనే విద్యార్థి అభిప్రాయపడ్డాడు.
ఐటీ ఉద్యోగి సమియాఖాన్ మట్లాడుతూ.. 'తాజా బడ్జెట్ నైపుణ్యాభివృద్ధికి దోహదపడేలా పథకాలు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించాలని అప్పుడే డిజిటల్ ఇండియా సాధ్యమవుతుంది..' అని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications