జురాసిక్ పార్క్ ఐకన్ స్టార్ కన్నుమూత: డాక్టర్ అలిన్ గ్రాంట్ గా చెరగని ముద్ర
ప్రముఖ హాలీవుడ్ నటుడుసర్ సామ్ నీల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సామ్ నీల్ ఇక తమ మధ్య లేడనే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇంట్లో ప్రశాంతంగా కన్నుమూశారని, ఎటువంటి అనారోగ్య కారణాలు లేవనీ చెప్పారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హాలీవుడ్ సినిమా ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తోన్నారు.
సామ్ నీల్ మరణానికి గల ఖచ్చిత కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. కొద్దిరోజుల కిందటే సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. వయస్సు మీద పడటం, వృద్ధాప్య సంబంధిత అంశాలు, గతంలో కేన్సర్ నుంచి బయటపడటం వంటి పరిణామాలతో కొద్దిరోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కూడా సినిమాల పరంగా యాక్టివ్ గా ఉన్నారు.

నార్త్ ఐర్లాండ్‌లో జన్మించిన సామ్ నీల్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూగించిన జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అలిన్ గ్రాంట్‌గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఈ చిత్రం ఆయనుకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది. జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ మూవీలకు కేరాఫ్ గా నిలిచారు.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జురాసిక్ పార్క్ లో పోషించిన డాక్టర్ అలిన్ గ్రాంట్ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. వాస్తవానికి ఈ పాత్రను మొదట ప్రముఖ నటుడు హారిసన్ ఫోర్డ్‌కు ఆఫర్ చేయగా, ఆయన నిరాకరించడంతో ఈ ల్యాండ్‌మార్క్ పాత్ర సామ్ నీల్‌కు దక్కింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో ఆ తర్వాత వచ్చిన జురాసిక్ పార్క్ 3, జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాలలో కూడా ఆయన అదే పాత్రలో నటించి మెప్పించారు.
సామ్ నీల్ లీడ్ రోల్స్ లేదా అడ్వెంచర్ మూవీలకు మాత్రమే పరిమితం కాలేదు. రొమాంటిక్ హీరో పాత్రల నుంచి క్రూరమైన విలన్ పాత్రల వరకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో రాణించారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ది పియానో, ది జంగిల్ బుక్, ఇన్ ద మౌత్ ఆఫ్ మ్యాడ్‌నెస్, ఈవెంట్ హారిజన్, హంట్ ఫర్ ది వైల్డర్ పీపుల్.. వంటి ఐకానిక్ చిత్రాలలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు.
1986లో జేమ్స్ బాండ్ పాత్ర కోసం రోజర్ మూర్ స్థానంలో నటించేందుకు ఆయన స్క్రీన్ టెస్టులు కూడా ఇచ్చారు. ఆ పాత్ర చివరికి తిమోతీ డాల్టన్‌కు దక్కింది. అయినప్పటికీ నిరాశ చెందలేదు. ఆ తర్వాత జురాసిక్ పార్క్ తో మెరిశారు. తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలతో హాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలను గుర్తిస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం సామ్ నీల్‌ను నైట్ కంపానియన్ ఆఫ్ ది న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ రిట్ పురస్కారంతో గౌరవించింది.
గతంలో ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతం అయ్యారు. స్టేజ్-3 యాంజియోఇమ్యునోబ్లాస్టిక్ టీ సెల్ లింఫోమా అనే క్యాన్సర్ బారిన పడ్డారు. అయినప్పటికీ ధైర్యంతో, పట్టుదలతో చికిత్స పొంది విజయం సాధించారు. తాను పూర్తిగా క్యాన్సర్ రహితంగా మారినట్లు ఆయనే స్వయంగా ప్రకటించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు.












Click it and Unblock the Notifications