భారత్ కు బిగ్ రిలీఫ్.. 20 వేల టన్నుల LPG తో భారత్ కు చేరుకున్న నౌక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. అటు భారత్ లోనూ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ తన కాన్యాయ్ ను కేవలం రెండు వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.
ఇక దేశంలో ఇంధన సంక్షోభం వేళ హార్మూజ్ జలసంధిని దాటిన ఎల్పీజీ లోడ్ తో ఉన్న ట్యాంకర్ సైమీ తాజాగా గుజరాత్ లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని మోసుకొచ్చింది. ఉద్రిక్తతల మధ్య మే 13 న ఈ నౌక హార్మూజ్ జలసంధిని దాటింది. నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు భారత్ కు చేరుకుంది. ఈ నౌకలో 8 మంది ఉక్రెనియన్లు, 13 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు కలిపి మొత్తం 21 మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. ఈ కార్గో లోడ్ మొత్తం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందినదే.
ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి గుండా రవాణా స్తంభించిపోయింది. గత రెండు నెలల్లో భారత చమురు నిల్వలు దాదాపు 15 శాతం తగ్గాయి. ఈ క్రమంలోనే దేశంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ గ్యాస్ సరఫరా రావడం భారత్ కు పెద్ద ఊరటను కలిగించే అంశం. భారత రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, పెట్రోలియం శాఖ, ఇండియన్ నేవీ సంయుక్తంగా జరిపిన సమన్వయంతో భద్రతా చర్యలు పర్యవేక్షించడం వల్లే ఈ నౌక సురక్షితంగా చేరుకుంది.

ఇక ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రక్షణకు ఇరాన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, భారత్ లాంటి మిత్ర దేశాల నౌకల భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నౌకతో పాటు మరో ఎల్పీజీ నౌక ఎన్వీ సన్ షైన్ కూడా హార్మూజ్ జలసంధిని దాటి మే 18న మంగళూరు పోర్టుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications