రూ.75లక్షల కరెంటు బిల్లుతో లుధియానా వాసికి ‘షాక్’
లుధియానా: విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సామాన్య జనం ఆందోళన కలిగే పరిస్థితులు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా, పంజాబ్ రాష్ట్రంలోని మాతానగర్ నివాసి అశోక్ గోయెంకా ఇంటికి నెలకు ఏకంగా రూ. 75 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారు.
7 లక్షల 63వేల యూనిట్ల విద్యుత్ వాడారని పేర్కొంటూ.. పంజాబ్ విద్యుత్ బోర్డు గోయెంకాకు రూ. 75,34,610ల బిల్లు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆయన, తన ఇల్లు విలువే అంత ఉండదని వాపోయారు.
కాగా, ఆయనకు ఇది మొదటిసారి కాదట. గతంలోనూ ఆయన భారీ విద్యుత్ బిల్లులే అందుకున్నారట. ఈ సందర్భంగా బాధితుడు అశోక్ గోయెంకా మీడియాతో మాట్లాడుతూ.. తాను పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నానని, ఇంత ఎక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు అందుకోవడం ఇదే మొదటిసారని అన్నారు.

ఇప్పటి వరకు తన ఇంటికి ప్రతీ నెల వచ్చే కరెంటు బిల్లు రూ. 3వేలకు మించలేదని చెప్పారు. అయితే ఈసారి రూ. 75,34,610ల బిల్లు వచ్చిందని, తన ఇల్లు చిన్నదని, ఇంత ఎక్కువ బిల్లు తాను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని అశోక్ ప్రశ్నించారు.
తన ఇల్లు అమ్మినా రూ. 40 లక్షలు రావని ఆయన వాపోయారు. కాగా, ఈ వ్యవహారంపై ప్రశ్నించేందుకు వెళ్లినా విద్యుత్ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. తనకు వచ్చిన బిల్లును సరి చేయడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications