చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సాయి దివ్య, అలేఖ్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత్య చేయడం సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ హత్యలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించారు.

ఈ కేసులో మృతురాలు సాయి దివ్య మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కీలకంగా మారుతున్నాయి. పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం ఆ పోస్టుల్లో 'శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్' అంటూ రాయడం అనుమానాలకు తావిస్తోంది.

అంతేకాకుండా, వారం రోజులుగా ఆమె విచిత్రంగా ప్రవర్తించేవారంటూ పోలీసుల విచారణలో తేలింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొందరు కొత్త వ్యక్తులు వారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారనే సమాచారం అందుకున్న పోలీసులు వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ ని సేకరించారు. అందులో గుర్తించిన వారందరినీ విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మదనపల్లె హత్యలు

అసలేం జరిగింది...

మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.

వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు.

ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపారని, ఆ తరువాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహర ఆచారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.

ఇంట్లోనే విచారణ...

కుమార్తెలను హత్య చేసినట్టు అనుమానిస్తున్న పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు విచారిస్తున్నారు. వారి ఇంట్లోనే విచారణ సాగుతోంది. అయితే, వారి మానసిక ప్రవర్తన భిన్నంగా ఉందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని పోలీసులను హెచ్చరించడంతో పోలీసులు ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసిక విశ్లేషకుల సహాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు మదనపల్లి పోలీసులు బీబీసీకి తెలిపారు.

విచారణ సాగుతున్న సమయంలో కొద్ది మంది సన్నిహిత బంధువులను మాత్రమే వారింట్లోకి అనుమతించారు. వారి ద్వారా నిందితులను శాంతింపజేసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు మృతులకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. తొలుత పోస్ట్ మార్టం నిర్వహించి, అనంతరం ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. క్లూస్ టీమ్ కూడా రంగంలో దిగింది. పలు ఆధారాలను సేకరించారు. వారి నివాసంలో దేవుళ్ల చిత్రపటాలతో పాటుగా మరికొన్ని విచిత్రంగా ఉన్న ఫోటోలను కూడా పోలీసులు గుర్తించారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మదనపల్లె హత్యలు

స్పష్టత రావడానికి సమయం పడుతుంది...

ఈకేసులో స్పష్టత రావడానికి సమయం పడుతుందని పోలీసులు అంటున్నారు. మీడియాతో మాట్లాడిన డీఎస్పీ రవి మనోహర్ ఆచారి విచారణ వివరాలను వెల్లడించారు.

"దేవుని భక్తి దశ నుంచి వారు ఆధ్యాత్మికగా ఇంకా లోతుల్లోకి వెళ్లిపోయారు. అంతకన్నా ఏదో ఉందని భావించినట్టు కనిపిస్తోంది. ఒక్క రోజు సమయం ఇవ్వండి.. పిల్లలు బ్రతికి వస్తారు.ఇంకా ఉంచండి అనడం కూడా అందులో భాగమే. వాళ్లంతా చాలా విద్యావంతులు. మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఆయన కూడా ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్నారు. డంబుల్ తో కొట్టి చంపినట్టు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా వాళ్లింట్లోకి ఎవరినీ రానివ్వడం లేదు. కరోనా వచ్చినప్పటి నుంచి పని వాళ్లని కూడా బయట పనిచేసుకుని పోవాల్సిందే అని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఆ నలుగురే ఉన్నారు. పూజలు చేసినట్టు ఆనవాళ్లున్నాయి. విచారణకు సమయం పడుతుంది. వాళ్లు షాక్ నుంచి కోలుకున్న తర్వాత విచారణ చేస్తాం" అని ఆయన వివరించారు.

వాళ్లంతా ట్రాన్స్ లోనే ఉన్నారు...

వారు మానసికంగా చాలా పరిపక్వతతో కనిపించే వారని, ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ స్థానికులు చెబుతున్నారు. చాలాకాలంగా అదే ఇంట్లో నివాసం ఉంటున్న పురుషోత్తం, పద్మజ కుటుంబం షిర్డీ సాయిబాబాను పూజించేవారని సమీప బంధువు మీడియాకి వెల్లడించారు. ఈ పరిస్థితి షాక్ కలిగిస్తోందన్నారు. 20 ఏళ్లుగా బాగా తెలుసని, వాళ్లంతా ట్రాన్స్ లో ఉన్నారని అన్నారు. మానసికంగా చాలా బ్యాలెన్స్ గా ఉండే వారు, ఇలా చేశారనంటే నమ్మశక్యంగా లేదన్నారు. వాళ్లంతా ఏడుస్తూ ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడడం సాధ్యం కావడం లేదని తెలిపారు.

ఏఆర్ రెహ్మాన్ ఇనిస్టిట్యూట్ లో ...

మృతులిద్దరూ ఉన్నత విద్యావంతులు, పెద్ద కుమార్తె అలేఖ్య మేనేజ్ మంట్ ఆఫ్‌ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చదివినట్టు పోలీసులు వెల్లడించారు. భోపాల్ లో ఆమె విద్యాభ్యాసం చేశారు. రెండో కుమార్తె సాయి దివ్య కరోనా కారణంగా ఇంటికి వచ్చారని, అంతకుముందు ఆమె బీబీఏ చేసి ఏఆర్ రెహ్మన్ ఇనిస్టిట్యూట్ లో సంగీత శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.

సాయి దివ్య వారం రోజుల నుండి విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఇంటిపైకి ఎక్కి దూకేస్తానంటూ హడావిడి చేయడంతో మంత్ర సంబంధిత సమస్యగా పూజలకు పూనుకున్నట్టు అంచనావేస్తున్నారు. ఆక్రమంలోనే ఇద్దరి హత్య జరిగి ఉంటుందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Crucial evidence recovered by Police in Madanapalle murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X