వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌.. సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కు అధ్యక్షురాలిగా పనిచేశారు.

'ఆంధ్రజ్యోతి' కథనం ప్రకారం.. ''మధులిక రావత్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌. ఆమె తండ్రి దివంగత రాజకీయ నాయకుడు మ్రిగేంద్ర సింగ్‌. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు.

సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కు ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. సైనిక ఉద్యోగుల భార్యలు, పిల్లలు, వారిపై ఆధారపడిన ఇతర కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ఏడబ్ల్యూడబ్ల్యూఏ కృషి చేస్తుంది.

మరణించిన సైనికుల భార్యలు, వారి దివ్యాంగ చిన్నారుల సాయం కోసం అనేక సంక్షేమ, ప్రచార కార్యక్రమాలనూ మధులిక నిర్వహించారు.

దీంతోపాటు ముఖ్యంగా కేన్సర్‌ బాధితుల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలనూ ఆమె నిర్వహించారు.

టైలరింగ్‌, అల్లికలు, బ్యాగుల తయారీ, కేకులు, చాక్లెట్ల తయారీ, బ్యూటీషియన్‌ కోర్సులు చేయడం ద్వారా స్వయంప్రతిపత్తి సాధించేలా వారిని ప్రోత్సహించేవారని'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇద్దరు కుమార్తెలతో మధులిక రావత్

1986లో బిపిన్ రావత్‌తో మధులికకు వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు చదువుతుండగా పెద్ద కూతురుకు పెళ్లయింది.

విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ

వన్డే సారథ్యం రోహిత్ చేతికి, కెప్టెన్ కోహ్లిపై సెలక్టర్ల వేటు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో... డాషింగ్‌ ఓపెనర్, వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనత ఉన్న ఏకైక బ్యాటర్‌ రోహిత్‌ శర్మ పూర్తి స్థాయిలో భారత వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు 'సాక్షి' వెల్లడించింది.

''టి20లకు ఇప్పటికే కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను వన్డేలకు కూడా నియమిస్తున్నట్లు సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. 34 ఏళ్ల రోహిత్‌ కనీసం 2023లో భారత గడ్డపైనే జరిగే వన్డే వరల్డ్‌కప్‌ వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది.

రోహిత్‌ టి20 కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచే వన్డే కెప్టెన్సీపై కూడా చర్చ కొనసాగుతోంది. పరిమిత ఓవర్ల రెండు ఫార్మాట్‌లకు ఒకే కెప్టెన్‌ బాగుంటుందనే సూచన చాలాసార్లు వినిపించింది.

అయితే బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి స్థాయి, కెప్టెన్‌గా అతని మెరుగైన రికార్డు చూస్తే ఇంత తొందరగా మార్పు జరగడం మాత్రం ఆశ్చర్యకరం.

మరో కోణంలో చూస్తే 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్‌గా తగినంత సమయం ఇచ్చి తన జట్టును తీర్చి దిద్దుకునే అవకాశం ఇవ్వడం సరైందిగా బోర్డు భావించి ఉంటుంది.

ఇకపై కోహ్లి టెస్టు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతాడు. అతని సారథ్యంలోనే జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో ఆడుతుంది.

ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రహానే... జట్టులో స్థానం నిలబెట్టుకున్నా వైస్‌ కెప్టెన్సీ కోల్పోయాడు. అతని స్థానంలోనే రోహిత్‌ను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కని హైదరాబాద్‌ బ్యాటర్‌ గాదె హనుమ విహారి దక్షిణాఫ్రికా సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉండి 'ఎ' జట్టు తరఫున ఆడుతున్న విహారి మూడు అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు చేసి తన ఫామ్‌ను చాటాడు.

సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌గా కాన్పూర్‌ టెస్టుల్లో సత్తా చాటినా ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌కు స్థానం లభించలేదు. గాయాల కారణంగా జడేజా, శుబ్‌మన్‌ గిల్, అక్షర్‌ పటేల్, రాహుల్‌ చహర్‌ పేర్లను పరిశీలించలేదని సెలక్టర్లు వెల్లడించారు.

పేదలకు సదవకాశం: ఓటీఎస్‌పై సీఎం జగన్

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పూర్తిగా స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పునరుద్ఘాటించినట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.

''దీని ద్వారా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, వాడుకోవాలా వద్దా అన్నది వారిష్టమని ఆయన స్పష్టం చేశారు.

గృహ నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణాల్ని ఓటీఎస్ ద్వారా మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు.

ఈ పథకం ద్వారా పేదలపై రూ. 10వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. ఓటీఎస్ కింద రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇంటిపై సంపూర్ణ హక్కులు లభిస్తాయని చెప్పారు.

ఓటీఎస్ ద్వారా ఇన్ని రకాలుగా మేలు జరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు, బలహీనవర్గాలకు గృహ నిర్మాణ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

'ఓటీఎస్ అమలు కకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనల్నీ గత ప్రభుత్వం పరిశీలించలేదు.

గత ప్రభుత్వ హయాంలో సుమారు 43 వేల మంది అసలు, వడ్డీ కట్టారు. ఈరోజు ఓటీఎస్‌పై మాట్లాడుతున్నవారు అప్పుడెందుకు కట్టించుకున్నారు?

గతంలో అసలు, వడ్డీ కట్టినా.... బి-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఓటీఎస్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం.

లబ్ధిదారులు ఆ ఇంటిని తమ అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కూ వారికుంటుంది. ఓటీఎస్ కింద డబ్బు కట్టినవారికి ఈనెల 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామని సీఎం చెప్పినట్లు'' ఈనాడు పేర్కొంది.

డబుల్ బెడ్రూం రిజర్వేషన్లకు హైకోర్టు నో

రెండు పడకల ఇండ్ల కేటాయింపులో రిజర్వేషన్ విధానం అమలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను పరిశీలిస్తే అన్ని వర్గాలకు రెండు పడకల ఇండ్ల కేటాయింపునకు అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది.

ఇండ్ల కేటాయింపులో బీసీలు, మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మానసిక వైకల్యం ఉన్నవారికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది.

రెండు పడకల ఇండ్ల కేటాయింపు జీవోను పరిశీలిస్తే... అర్హులైన ఇతర వర్గాల వారికి కూడా కేటాయింపు ఉన్నదన గుర్తు చేసింది.

అందువల్ల రిజర్వేషన్లు కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చినట్లు స్పష్టం చేసింది. ఎవరికి ఇండ్లు కేటాయించాలో సూచిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పిల్‌లోని ఆ అంశంపై విచారణ చేయలేమని తెలిపినట్లు '' నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)  

English summary
Madhulika Rawat: Former President of Military Employees' Wives Welfare Association
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X