Bihar CM: మహాకూటమి బీహార్ సీఎం అభ్యర్ధి ఖరారు..! నేడే ప్రకటన..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్ధి విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటూ తేల్చడం లేదు. అదే సమయంలో కూటమిలో పక్షాలు సీట్ల విషయంలో పట్టుదలకు పోవడంతో దాదాపు 11 చోట్ల కూటమి నుంచే రెండు పార్టీల అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. పైకి స్నేహపూర్వక పోటీ అని చెప్తున్నా గెలుపు కోసం అభ్యర్ధులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సమస్యలు తేల్చడంతో పాటు సీఎం అభ్యర్ధిపై క్లారిటీ ఇవ్వనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ తో పాటు కీలక నేతలు ఇవాళ ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ తో సమావేశం కాబోతున్నారు. బీహార్ లో సీఎం అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ ను సమర్దిస్తున్నట్లు వారు ఆయనకే చెప్పబోతున్నారు. దీంతో ఓ సమస్య తీరిపోనుంది. మహాకూటమి తరఫున సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తే మంచిదన్న సూచనలు రావడంతో ఈ మేరకు అధికారికంగానే ప్రకటన చేయబోతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కూటమి పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్న పార్టీలు కూడా ఒకే సీట్లో పోటీ పడుతుంటే వారిలో ఎవరిని పోటీ నుంచి తప్పించాలన్న దానిపై ఇవాళ కూటమి నేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో మహాకూటమి పోటీపై పూర్తి క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ తో తేజస్వీ యాదవ్ చర్చల తర్వాత కీలక ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) , రాష్ట్రీయ లోక్ మోర్చా పోటీ పడుతున్నాయి. అలాగే విపక్ష మహాకూటమి నుంచి కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు వామపక్షాలు, వికాశీల్ ఇన్సాన్ పార్టీ పోటీలో ఉన్నాయి. ఈ రెండు కూటములుగా కాకుండా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ పోటీలో ఉంది.












Click it and Unblock the Notifications