మరాఠీ రుద్ర: నంబర్ గేమ్..ఇతరులదే ప్రభంజనం
Maharashtra Assembly exit Polls 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ మధ్య పోటీ నెలకొంది.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
ఫాలొది సట్టా బజార్ తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇది. మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఈ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని పేర్కొంది. 150 నుంచి 170 నియోజకవర్గాల్లో మహాయుటి జెండా రెపరెపలాడుతుందని సట్టా బజార్ అభిప్రాయపడింది.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూడా ఇలాంటి అంచనాలనే వెలువడించింది. మహాయుటి వైపే మొగ్గు చూపింది. ఈ కూటమి హవా వీస్తుందని అంచనా వేసింది. 152 నుంచి 160 నియోజకవర్గాల్లో జెండా పాతుతుందని పేర్కొంది. ఇందులో కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది.
మహారాష్ట్రకు చెందిన లోక్‌షాహి మరాఠీ రుద్ర అనే ఎగ్జిట్ పోల్స్ సంస్థ మాత్రం వీటికి భిన్నంగా రిజల్ట్స్ ఇచ్చింది. హంగ్ తప్పదని తేల్చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఏ కూటమి కూడా అందుకోలేదని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు లేదా ఇతరుల సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
మరాఠీ రుద్ర ప్రకారం చూస్తే మహాయుటి కూటమికి 128 నుంచి 142 సీట్లు లభిస్తాయి. 125 నుంచి 140 స్థానాలు మహా వికాస్ అఘాడీ ఖాతాలో పడతాయి. ఇక ఇతరులు/స్వతంత్రులు 18 నుంచి 23 నియోజకవర్గాలలో విజయ ఢంకా మోగిస్తారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారు.












Click it and Unblock the Notifications