ఘోర ప్రమాదం: మంటల్లో బస్సు దగ్ధం - పలువురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
నాసిక్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నట్లు చెప్పారు. నాసిక్-ఔరంగాబాద్ జాతీయ రహదారి మీద ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 32 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి నాసిక్ నుంచి ఔరంగాబాద్‌కు బయలుదేరింది ఓ లగ్జరీ మల్టీ యాక్సిల్ ప్రైవేటు బస్సు. జాతీయ రహదారి మీద వెళ్తోన్న సమయంలో ప్రమాదానికి గురైంది.

తొలుత ఓ వాహనాన్ని అతివేగంగా ఢీ కొట్టింది. దీనితో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఊపిరి ఆడక మరి కొందరు మృతి చెందారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, నేషనల్ హైవే పెట్రోలింగ్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. బస్సు అద్దాలను పగులగొట్టి మృతదేహాలను వెలికి తీశారు.

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల సైరన్ మోతలతో నిండిపోయింది. ఈ ఘటనతో నాసిక్-ఔరంగాబాద్ జాతీయ రహదారి మీద వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.












Click it and Unblock the Notifications