గవర్నర్‌తో మహా ముఖ్యమంత్రి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేనా?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అధికారం చెరో సగం అంటూ మెలిక పెడుతోంది. 50-50 ఫార్ములా ఎన్నికలకు ముందే మాట్లాడుకున్నామని.. అదే క్రమంలో ప్రభుత్వ పీఠం చెరి సగం పంచుకునే విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు శివసేన సీనియర్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో భేటీ కావడం చర్చానీయాంశమైంది.
రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఫడ్నవీస్. అయితే ఈ భేటీ దీపావళి పండుగ నేపథ్యంలో జరిగిందే తప్ప ఎలాంటి రాజకీయ కోణం లేదంటున్నారు కొందరు. అదలావుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఈ తరుణంలో ఆయన గవర్నర్‌ను కలవడం అదే కోణం అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా వీరిద్దరి ప్రస్తుత కలయిక మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు శివసేన సీనియర్ లీడర్ దివాకర్ రౌటే గవర్నర్‌తో విడిగా భేటీ కావడం హాట్ టాపికైంది.

ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 50 ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో ఒకే పార్టీ నుంచి రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఘనత ఆయనకే దక్కనుంది. అయితే ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అధికారంలో వాటా అడుగుతోంది. అటు శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాక్రే ముంబై వర్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందడంతో ఆయన్ని సీఎం చేయాలనేది ఆ పార్టీ సీనియర్ల ప్లాన్.
దాంతో బీజేపీ, శివసేన మధ్య చర్చలు సుదీర్ఘంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కాసింత ఆలస్యం కావొచ్చనే వాదనలు లేకపోలేదు. ఒకవేళ బీజేపీ పెద్దలు 50-50 ఫార్మాలాకు సై అన్నా కూడా.. ఫస్ట్ టర్మ్ సీఎం ఎవరనే విషయంలో ఈ రెండు పార్టీల మధ్య చర్చలు అంత ఈజీగా కొలిక్కి రావేమో అనే రీతిలో ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications