Maharastra Polls: ముంబై సీట్లపై మహావికాస్ అఘాడీలో విభేదాలు..! వాటి కోసం పట్టు...
మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ పడుతున్న మహావికాస్ అఘాడీ కూటమిలో సీట్ల పంపకాల వివాదం తలెత్తింది. ముఖ్యంగా ముంబై పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల విషయంలో సీట్ల పంపకాల్లో కూటమిలో మూడు పార్టీలు కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ పవార్ వర్గం కీచులాడుకుంటున్నాయి. ఈ మూడు పార్టీలు ముంబై సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సమస్య అంతకంతకూ పెరుగుతోంది.
ముంబై నగరం పరిధిలోకి వచ్చే కీలక స్ధానాల్ని మూడు పార్టీలూ ఆశిస్తున్నాయి.ఇందులో వెర్సోవా, అంధేరీ ఈస్ట్, బైకుల్లా, కొలాబా, ధారవి, సియోన్ కోలివాడ, వడాలా, వాండ్రే ఈస్ట, చండీవాలి వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ లు ఉన్న ఐదు స్థానాలు మలబార్ హిల్, విలే పార్లే, చార్కోప్, బోరివాలి, ములుండ్ లో పోటీకి మాత్రం ఎంవీఏ పార్టీలు మొగ్గు చూపడం లేదు. దీంతో తమకు అవకాశమున్న స్ధానాలనే వీరు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికలలో ముంబైలో 14 సీట్లను ఈ కూటమి గెల్చుకుంది. తాజా లోక్‌సభ ఎన్నికలలో మూడు స్థానాలను గెలుచుకున్న శివసేన ఉద్ధవ్ వర్గం వాండ్రే ఈస్ట్ వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో తమకు బలం ఉందని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ముస్లిం ఓట్లు పెరగడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతోంది.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మళ్లీ పట్టు సాధించాలనే ఆశతో 18 స్థానాల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ముంబైలో గతసారి సీట్లు గెలవని ఎన్సీపీ కూడా అనుశక్తి నగర్, కుర్లా, అంధేరి వెస్ట్ సహా ఏడు నియోజకవర్గాలను కోరుతోంది. దీంతో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన నెలకొంది.












Click it and Unblock the Notifications