సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల సమ్మె-స్తంభించిన పాలన-75 వేల కాంట్రాక్టు నియామకాలు..
ఉద్యోగుల సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు తీవ్రమవుతున్నాయి. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్దితి నెలకొంది.
ముంబై : మహారాష్ట్రలో సీపీఎస్ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఓపీఎస్ అమలు కోసం సమ్మెకు దిగారు. రెండు రోజులుగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఉద్యోగుల సమ్మెను కౌంటర్ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
మహారాష్ట్రలో ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోతున్నాయి. అన్ని నగరాలు, పట్టణాల్లో ఉద్యోగులు రోడ్డెక్కుతుంటంతో ప్రభుత్వ పాలన స్తంభించింది. దీంతో వీరి సమ్మెకు కౌంటర్ గా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. వీరి స్ధానంలో తాత్కాలిక ఉద్యోగుల నియామకం కోసం 9 ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తం 75 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించడం ద్వారా ఉద్యోగుల సమ్మెకు కౌంటర్ ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే సర్కార్ సిద్ధమవుతోంది.

అయితే సమ్మె చేస్తున్న ఉద్యోగుల స్ధానంలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో 2014లోనూ ఇలాంటి నియామకాలే చేశారని, వారి కాంట్రాక్టులు కూడా తాజాగా ముగిశాయని గుర్తుచేస్తోంది. ఇప్పుడు మరోసారి కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో శాశ్వత ఉద్యోగుల భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యమ్నాయ మార్గాల్లో వీరిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications