మహిళా కాంగ్రెస్ వార్: భర్తలను తరిమి తరిమి కొట్టారు, హసీనా, ఝాన్సీరాణి ఫైట్, నో రాహుల్ !
పురుషులకు తామేమీ తీసిపోమన్నట్టుగా మహిళా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు ముష్టియుద్దానికి దిగారు.
చెన్నై: పురుషులకు తామేమీ తీసిపోమన్నట్టుగా మహిళా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు ముష్టియుద్దానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టుకున్నారు. అది చాలదంటూ వారి భర్తలు రంగంలోకి దిగి నానా హంగామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి హసీనా సయ్యద్, ఆమె భర్త ఉమర్ ను చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తరిమి తరిమి కొట్టారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. రాహుల్ గాంధీ పర్యటన జరిగి మూడు రోజులు పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులు చేసిన రచ్చ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

రాహుల్ గాంధీ పర్యటన చిచ్చు !
మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ చెన్నై వచ్చారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా చెన్నైలోని సత్యమూర్తి భవన్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం) దగ్గర తిరువళ్లూరుకు చెందిన మహిళా నేత గౌరి గోపాల్ పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హసీనా ఫోటో, పేరు గల్లంతు !
గౌరీ గోపాల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ ఫోటో, పేరు గల్లంతు అయ్యింది. తన ఫోటో, పేరు లేదని కక్ష పెంచుకున్న హసీనా వెంటనే గౌరీ గోపాల్ ను పదవి నుంచి తొలగించారు. బుధవారం సత్యమూర్తి భవన్ లో మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది.

నాతో పెట్టుకుంటే ఇదే గతి !
సత్యమూర్తి భవన్ లో జరిగిన సమావేశానికి హసీనా సయ్యద్ హాజరైనారు. తనను విస్మరిస్తే ఎవ్వరికైనా ఇదే గతి అంటూ గౌరీ గోపాల్ ను ఉద్దేశించి పరోక్షంగా హసీనా సమావేశంలో నోరుజారడంతో వివాదానికి దారి తీసింది. అదే సమావేశంలో ఉన్న గౌరీ గోపాల్ మద్దతుదారులు రగిలిపోయారు.

సీన్ లోకి ఝాన్సీరాణి !
గౌరీ గోపాల్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీరాణి నిలిచారు. అప్పుడే గొడవ పెద్దది అయ్యింది. అదే సందర్బంలో గౌరీ గోపాల్ మద్దతుదారులు హసీనా మీద తిరగబడ్డారు. హసీనా సయ్యద్, ఝాన్సీరాణి ముష్టియుద్దానికి దిగారు.

భార్యల కోసం భర్తలు వచ్చారు !
హసీనా, ఝాన్సీరాణిని వారించడానికి వారి భర్తలు రంగంలోకి వచ్చారు. హసీనా భర్త ఉమర్ ను టార్గెట్ చేసుకుని ఝాన్సీరాణి, గౌరీ గోపాల్ ఆయన మీద దాడి చెయ్యడంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది. హసీనా సయ్యద్, ఆమె భర్త ఉమర్ ను సమావేశ మందిరం నుంచి తరిమి తరిమి కొట్టారు.

లేడీస్ కొట్టడంతో పరుగో పరుగో !
ఒక్క సారిగా మహిళలు దాడి చెయ్యడంతో హసీనా సయ్యద్, ఆమె భర్త ఉమర్ సమావేశ మందిరం నుంచి బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హసీనా సయ్యద్, ఆమె భర్త ఉమర్ ను అక్కడి నుంచి పంపించేశారు.

లేడీస్ దెబ్బకు చేతులు ఎత్తేసిన అధ్యక్షుడు !
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమక్షంలోనే గొడవ జరిగిందని సమాచారం. లేడీస్ దెబ్బకు ఆయన తప్పుకోవడంతో మహిళా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోవడంతో రచ్చరచ్చ అయ్యిందని తెలిసింది. ఈ విషయంపై హసీనా సయ్యద్ ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీకి వెళ్లారు.

రాహుల్ చెప్పినా వినం, మేం ఇంతే !
చెన్నైలో పర్యటించిన రాహుల్ గాంధీ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. గ్రూపులు వీడాలని, అందరూ కలిసి పని చెయ్యాలని హితభోద చేశారు. అయితే ఆయన వెళ్లిన వెంటనే మహిళా కాంగ్రెస్ నేతలు మేము ఇంతే, ఎవ్వరు చెప్పినా వినం అంటూ మరోసారి నిరూపించారు.
నగ్మా, కుష్బు అయినా అంతే !
సినీరంగంలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నగ్మా, కుష్బు వర్గాలు సైతం గ్రూపులుగా విడిపోయారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల్లో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని మరో సారి వెలుగు చూడటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు












Click it and Unblock the Notifications