సంప్రదాయం పేరిట దురాచారం: ఎంగిలాకులపై దళితులు పొర్లుదండాలు
బెంగుళూరు: భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా సంప్రదాయం పేరిట దురాచారాలు అమలవుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 500 ఏళ్లుగా ఓ దురాచారాన్ని అమలు చేస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని దీనిపై నిషేధం విధించాలని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని దక్షణి కనర జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో మూడు రోజులపాటు 'మడె స్నాన' పేరిట తంతు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మధ్యలో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఉత్సవాల్లో భాగంగా మొదట బ్రాహ్మణులకు పంక్తి భోజనాలు ఏర్పాటుచేస్తారు. భోజనం పూర్తయ్యాక వారి ఎంగిలి విస్తర్లపై దళితులతో పొర్లు దండాలు పెట్టిస్తారు. అలా పొర్లుదండాలు చేస్తే దళితులకు చర్మ రోగాలు తగ్గుతాయని, వివాహ, సంతాన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా తమిళనాడు, కర్ణాటకలో ఇది అనాదిగా పాటిస్తున్న ఆచారం. తమిళనాడులోని కరూర్ జిల్లా నెరూర్‌లోని సదాశివ భర్మేంద్రాయి ఆలయంలోనూ ఈ దురాచారం కొనసాగుతుంది. దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలాంటి ఆచారాల వల్ల పొర్లుదండాలు పెడుతున్న వారి గౌరవం, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కేంద్రం వాదిస్తోంది.
ఈ ఆచారంపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆచారాన్ని స్వచ్ఛందంగానే పాటిస్తూ ఉండొచ్చని, రాజ్యాంగంలోని మతస్వేచ్ఛ హక్కు కారణంగా ఈ దురాచారాలను రూపుమాపలేకపోతున్నామని ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సుప్రీంను కోరింది.
కాగా, ఈ ఆచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది స్వచ్ఛందంగా పాటిస్తున్న ఆచారమే కానీ, ఇందులో కుల ప్రాతిపదికగా వివక్ష చూపడం ఏమీలేదని కొందరి వాదనగా ఉంది. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా ఎన్నికల్లో దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications