ఇండియా కూటమి ఛీఫ్ గా మల్లిఖార్జున ఖర్గే-కన్వీనర్ గా నితీశ్ ఎంపిక..
వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు జట్టు కట్టిన ఇండియా కూటమి పార్టీలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ కూటమి ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకున్నాయి. అలాగే బీహార్ సీఎం, జేడీయూ బాస్ నితీశ్ కుమార్ ను కన్వీనర్ గా ఎంచుకున్నారు. అయితే కూటమిలో ఏకాభిప్రాయం వస్తేనే తాను కన్వీనర్ పదవి తీసుకుంటానని నితీశ్ కుమార్ షరతు పెట్టారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలపై చర్చించేందుకు విపక్ష ఇండియా కూటమిలో ఉన్న 14 పార్టీలు ఇవాళ వర్చువల్ గా భేటీ అయ్యాయి. ఇందులో ఛైర్ పర్సన్, కన్వీనర్ పదవులను భర్తీ చేశారు. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. ఇప్పటికే ఇండియా కూటమిలో పదవులు భర్తీ చేయాలని, నితీశ్ కు కన్వీనర్ పోస్టు ఇవ్వాలని జేడీయూ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కూటమిలో పార్టీలు సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి.

ఇండియా కూటమి పేరుతో విపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం వివిధ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు పెద్ద పీట వేస్తూ పలు రాష్ట్రాల్లో సీట్లను కూడా త్యాగం చేస్తోంది. అంతిమంగా మొత్తం లోక్ సభ సీట్లలో కేవలం సగం సీట్లకే పరిమితమయ్యేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడుతోంది. తద్వారా కూటమి విజయవంతంగా ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటోంది. అయితే మమత వంటి నేతలు మాత్రం కూటమిలో తమ మాటే నెగ్గాలనే పంతం ప్రదర్శిస్తుండటం తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications