
కాంగ్రెస్ అధినేతగా మల్లిఖార్జున ఖర్గే-పగ్గాలు అప్పగించిన సోనియా-కొత్త బాస్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఇవాళ పగ్గాలు చేపట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లోకి ఖర్గే
సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన మల్లిఖార్జున ఖర్గే ఇవాళ పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడు వచ్చినట్లయింది. గతంలో సీతారాం కేసరి నుంచి సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన తర్వాత
ఇప్పటివరకూ ఆమే నెట్టుకొచ్చారు. ఇప్పుడు సోనియా నుంచి ఆ బాధ్యతను ఖర్గే తీసుకున్నారు.

పెద్ద గౌరవమన్న మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట్లాడిన ఖర్గే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్మికుడి కుమారుడి నుంచి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకూ సాగిన తన ప్రస్ధానం గురించి ఖర్గే గర్వంగా వివరించారు. నా పనితీరు, అనుభవంతో పార్టీని ఉన్నతశిఖరాలకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఖర్గే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 1969లో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడిగా ప్రస్ధానం ప్రారంభించిన తనను మీరు ఈ అత్యన్నత స్ధాయికి తీసుకెళ్లారంటూ పార్టీ నేతల్ని ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యానించారు. గాంధీ, నెహ్రూల మార్గదర్శకత్వంగా సాగిన కాంగ్రెస్ వారసత్వాన్ని ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఖర్గే వెల్లడించారు.

ఖర్గేపై సోనియా ప్రశంసలు
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని ఖర్గేకు అప్పగించిన తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన బాథ్యతల్ని శక్తివంచన లేకుండా నిర్వహించానని, ప్రస్తుతం వాటి నుంచి తప్పుకోవడం ఊరటగా భావిస్తున్నట్లు సోనియా వెల్లడించారు. తనపై ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చూపిన ప్రేమ గర్వంగా ఉందన్నారు. ఇది తన ఊపిరి ఉన్నంతవరకూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు సోనియా భావోద్వేగంగా చెప్పారు. ఖర్గే కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తినిస్తారని, సందేశం అందిస్తారని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు స్వంత అభీష్టానుసారం ఎన్నుకున్న అధ్యక్షుడు ఖర్గే కావడం తనకు అత్యంత సంతృప్తి నిచ్చిందన్నారు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు, భూమితో ముడిపడిన నాయకుడని, తన కృషి, అంకితభావంతో ఒక సాధారణ కార్యకర్త నుండి ఈ స్థాయికి చేరుకున్నారని సోనియా గాంధీ ప్రశంసలు

కాంగ్రెస్ ప్రక్షాళన మొదలు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టగానే పార్టీ అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీ సభ్యులు సహా పార్టీ కార్యదర్శులంతా రాజీనామాలు చేస్తున్నారు. తద్వారా ఖర్గే తన సొంత టీమ్ తయారు చేసుకునేందుకు అవకాశం కలగబోతోంది. కాంగ్రెస్ లో అత్యున్నత స్ధాయి నుంచి కింది స్ధాయి వరకూ ప్రక్షాళన చేసేందుకు ఖర్గే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను ముందుగా రాజీనామాలు చేయమని సూచించినట్లు తెలుస్తోంది.