మాల్యా, నీరవ్ మోడీ సహా దొంగలు ఎగ్గొట్టిన రుణాల లెక్క ఇదే..! కేంద్రం క్లారిటీ..!
ప్రభుత్వం విదేశాలకు పారిపోయిన డిఫాల్టర్లను, రూ.58,000 కోట్ల మొత్తం అప్పును, రూ. 19,187 కోట్ల వసూళ్ల పురోగతిని, FEoA మరియు PMLA కింద అమలు చర్యలను వెల్లడించింది.
భారత్ లో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని, వాటితో వ్యాపారాలు చేసి, నష్టాలు మూటగట్టుకుని, ఆ తర్వాత ఎంచక్కా విదేశాలకు పారిపోయిన వారిని వెనక్కి తీసుకురావడంలో కేంద్రం విఫలమవుతోంది. దీంతో వారు హాయిగా విదేశాల్లో బహిరంగంగానే తిరుగుతున్నారు. అయినా వారిని స్వదేశానికి తీసుకొచ్చి చట్టముందు నిలబెట్టడం కేంద్రానికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న విమర్శలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్న కేంద్రం.. వారి అప్పుల్ని మాత్రం బయటపెట్టింది.
భారతీయ బ్యాంకులకు రుణపడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటుకు వెల్లడించింది. ఇలాంటి వారు ఎగ్గొట్టిన మొత్తం రుణాల విలువ రూ.58,000 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు వీరంతా బకాయిలుగా ఉన్నారని ప్రకటించింది. ఇందులో అసలు, వడ్డీలు కూడా చేరినట్లు తెలిపింది. ఆస్తుల జప్తు, రుణాల రికవరీ ప్రక్రియల ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు రూ.19,187 కోట్లు వసూలు చేశాయని పేర్కొంది.

ఇలాంటి ఆర్థిక నేరాల్లో మొత్తం 53 కేసులు నమోదు చేసినట్లు కేంద్రం పార్లమెంట్ కు తెలిపింది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మోసగించిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సందేసరా కుటుంబం వంటి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో ఉన్నారు. బ్యాంకులకు విజయ్ మాల్యా రూ. 22,065 కోట్లు బకాయిపడ్డాడని, అతని ఆస్తుల జప్తు, రికవరీ చర్యల ద్వారా ఇప్పటివరకు రూ. 14,000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిపింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ. 9,656 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. అతని నుండి ఇప్పటివరకు రూ. 545 కోట్లు రికవరీ అయ్యాయి. మాల్యా, మోడీతో పాటు ఇతర ఆర్థిక నేరగాళ్ల బకాయిలు మొత్తం కలిపి రూ. 58,000 కోట్లను దాటాయి.

స్టెర్లింగ్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రై.లిమిటెడ్, స్టెర్లింగ్ సెజ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన నితిన్ సందేసరా, చేతన్ సందేసరా తమ బకాయి రుణాల్ని సెటిల్ చేసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లతో వీరు రూ.496 కోట్ల విలువైన రాజీ ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో 15 మంది ప్రధాన ఆర్థిక నేరగాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ఇప్పటికే రుణదాతలతో రాజీ ఒప్పందాలను కుదుర్చుకున్నారని కేంద్రం తెలిపింది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం (FEOA) మరియు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, నిందితులను అప్పగించడానికి, రుణ వసూళ్లను గరిష్టంగా పెంచడానికి అధికారులు కృషి చేస్తున్నారని కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications