టెన్త్ పాస్ అయితే చాలు నెలకు రూ.1500-ఖాతాల్లో జమ ప్రారంభం..!
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ (mamata Banerjee)ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ యువతకు మేలు చేసేలా యువ సాథీ (yuva sathi) పేరుతో ఓ కొత్త పథకాన్ని ఇవాళ ప్రారంభించారు. అసలే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో నిరుద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఈ పథకాన్ని ఇవాళ్టి నుంచే అమల్లోకి కూడా తెచ్చేశారు.
రాష్ట్రంలో పదో తరగతి పాసై నిరుద్యోగులుగా ఉన్న 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల యువతకు నెలకు 1500 చొప్పున ప్రభుత్వం చెల్లించేలా యువ సాథీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని భావించిన ప్రభుత్వం.. ఎందుకైనా మంచిదని ఇవాళ్టి నుంచే అమల్లోకి కూడా తెచ్చేసింది. దీంతో నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బుల జమ కూడా ప్రారంభమైంది. ఈ పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలో నిరుద్యోగంపై సీం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం తగ్గిందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం 40 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ కూడా అందించిందని ఆమె గుర్తుచేశారు. వారిలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి కూడా పొందుతున్నారని మమత తెలిపారు. రాష్ట్రంలో ఐటీ సహా పలు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటే ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. అయితే కేవలం 10వ తరగతి మాత్రమే పాసైన నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు రావన్న బాధ లేకుండా యువ సాధీ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మమత వెల్లడించారు.












Click it and Unblock the Notifications