ధ్యానం చేయడానికీ కెమెరా తీసుకెళ్తారా ? మోడీపై మమత సెటైర్లు..! ఈసీకి ఫిర్యాదు చేస్తా..
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. రేపటితో ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. జూన్ 1న తుది దశ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించబోతున్నారు. అయితే సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ప్రధాని మోడీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లి రెండు రోజుల పాటు ధ్యానంలో నిమగ్నం కాబోతున్నారు.
దీనిపై విపక్షాలు సెటైర్లు మొదలుపెట్టేశాయి. ప్రధాని మోడీ కన్యాకుమారి ధ్యాన పర్యటనపై స్పందిస్తూ.. ఎవరైనా మెడిటేషన్ చేసుకోవచ్చని, అయితే దానికీ కెమెరా తీసుకెళ్లాలా అంటూ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఫలితాలకు 48 గంటల ముందు ప్రధాని మోడీ మెడిటేషన్ పేరుతో ఏసీ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారన్నారు. తాను కూడా కన్యాకుమారి వెళ్లాలనుకున్నానని, కానీ మోడీ టూర్ తో విరమించుకున్నట్లు తెలిపారు.

తనను దేవుడు ఓ కారణం చేత పంపాడంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపైనా మమతా బెనర్జీ స్పందించారు. ఆయన దేవుడైతే మెడిటేషన్ అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ఇతరులు ఆయన కోసం మెడిటేషన్ చేయాలన్నారు. కన్యాకుమారిలో ప్రధాని మోడీ మెడిటేషన్ ను టీవీల్లో చూపిస్తే మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చర్యలు కోరుతూ ఈసీని ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు. తద్వారా మోడీ మార్కెటింగ్ ఎత్తుల్ని జనంలోకి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications