బెంగాల్లో సంచలనం- బీజేపీ నేత సాయం కోరిన మమత- కాల్ రికార్డింగ్ బయటకు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజుకో సంచలనం చోటు చేసుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల యుద్ధంలో మాటల తూటాలు పేలుతుండగా.. ఇప్పుడు ఏకంగా నందిగ్రామ్ వేదికగా జరిగిదంటూ బీజేపీ బయటపెట్టిన ఓ వ్యవహారం మరింత కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పుడు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
నందిగ్రామ్‌లో మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారితో పోటీపడుతున్న సీఎం మమతా బెనర్జీ.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా సువేందు అధికారి అనుచరుడైన ప్రళయ్ పాల్ సాయం కోరినట్లు ఓ కాల్ రికార్డింగ్ బయటికి వచ్చింది. దీంతో ఇందులో సువేందుపై గెలుపు కోసం ఆయన అనుచరుడి సాయం కోరుతూ మమత విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ నేత, సువేందు అనుచరుడైన ప్రళయ్ పాల్ బయటపెట్టిన ఈ కాల్ రికార్డింగ్ ఇరు పార్టీల మధ్య కొత్త చిచ్చు రేపింది.

ఈ కాల్ రికార్డింగ్‌లో బీజేపీ నేత ప్రళయ్ పాల్‌ను నందిగ్రామ్‌లో తన కోసం, టీఎంసీ గెలుపు కోసం ప్రచారం చేయాలని మమత కోరుతున్నట్లుగా ఓ వాయిస్ ఉంది. దీంతో బీజేపీ నేతలు ప్రళయ్ పాల్ వీడియోను బయటపెట్టారు. దీన్ని టీఎంసీ నేతలు తోసిపుచ్చారు. ఈ కాల్‌లో మాట్లాడింది మమత కాదని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు మమత తనకు కాల్ చేసి నందిగ్రామ్‌లో తన కోసం పనిచేయాలని కోరారని, కానీ తనకు సువేందు అధికారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతం తాను బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు ప్రళయ్ పాల్ తెలిపారు. గతంలో సీపీఎం అధికారంలో ఉండగా.. తమపై దౌర్జన్యకాండ జరిగినప్పుడు సువేందు కుటుంబం తనకు అండగా నిలిచిందన్నారు.












Click it and Unblock the Notifications