అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాడి.. ఐదుగురికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద ఓ దుండగుడు దాడులు చేస్తూ కలకలం సృష్టించారు. ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.
భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ (గురురామ్ దాస్ లంగర్) వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో తనకు ఎదురైన వ్యక్తులపై దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో అక్కడంతా భయాందోళనలు నెలకున్నారు. అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు.

ఈ దాడిలో గాయపడినవారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు ఉన్నారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి నిలకడగా ఉండగా.. ఒకరి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
దాడికి పాల్పడిన వ్యక్తితోపాటు అతడి సహచరుడిని స్థానికులు అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, దాడికి ముందు నిందితులు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించారని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications