ఆ కామాంధుడిని రెండు సార్లు ఉరి తియ్యండి: కోర్టు సంచలన తీర్పు
చెన్నయ్: కామవాంఛ తీర్చుకుని ఆమెతో పాటు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన కసాయికి రెండు సార్లు ఉరి శిక్షతో పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు మహిళ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అనే కామాంధుడు శిక్షకు గురైనాడు. నిందితుడిని కట్టుదిట్టమైన భద్రతతో జైలుకు తరలించారు.
వివరాలు................!
కోయంబత్తూరులోని గణపతి రామకృష్టాపురం, రంగనాథన్ వీధిలో మరుదమాణిక్య, వత్సలాదేవి (26) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి మగిళన్ (6), ప్రణీత్ (11 నెలలు) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వత్సలాదేవి ఇంటిలో సెంథిల్ అద్దెకు ఉండేవాడు. నిత్యం సెంథిల్ భార్య లీలావతితో గొడవపడేవాడు.

మరుదమాణిక్య, వత్సలాదేవి చాలా సార్లు సెంథిల్ దంపతులకు నచ్చ చెప్పారు. అయినా వారిలో మార్పురాలేదు. సెంథిల్ భార్య లీలావతి పుట్టింటికి వెళ్లిపోవడం, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయించారు, ఈ విషయంలో సెంథిల్ వత్సలాదేవి మీద కక్ష పెంచుకున్నాడు.
2014 జూన్ 1వ తేదిన వత్సలాదేవి పిల్లలతో కలిసి ఇంటిలో ఉంది. ఆ సమయంలో సెంథిల్ అక్కడికి వెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. వత్సలాదేవి ప్రతిఘటించడంతో సెంథిల్ సహనం కొల్పోయాడు. సమీపంలోని వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని వత్సలాదేవిని ఇష్టం వచ్చినట్లు పోడిచాడు. రక్తపుమడుగులో ఆమె మరణించారు.
దిక్కుతోచని స్థితిలో ఎదురుగా ఉన్న ఆమె కుమారులు మగిళన్, ప్రణీత్ లను దారుణంగా పోడిచి హత్య చేసి వారి దగ్గర ఉన్న బంగారు నగలు లూటీ చేసి అక్కడి నుండి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెంథిల్ ను అరెస్టు చేశారు. అప్పటి నుండి గత వారం వరకు కేసు విచారణ జరిగింది. మంగళవారం తుదితీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
మంగళవారం సెంథిల్ ను కోర్టుకు తీసుకు వచ్చారు. అదే సమయంలో వత్సలాదేవి తల్లి దండ్రులు, అత్తమామ, భర్త కోర్టు హాల్ లోకి చేరుకున్నారు. న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పు వెళ్లడించారు. వత్సలాదేవి శరీరంలో 54 కత్తి పోట్లు, ఆమె ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 కత్తి పోట్లు, 11 నెలల పసికందు మీద 11 కత్తి పోట్లు ఉన్నాయని అన్నారు.
వత్సలాదేవి లోంగలేదని ఆమెను హత్య చేసిన నిందితుడు సాక్ష్యం చెబుతారనే సాక్షులు ఉండకూడదనే తలంపుతో ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు రుజువు అయ్యింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు యావజ్జీవ కారగారశిక్ష, తమను తాము రక్షించుకొలేని ఇద్దరు చిన్నారులను హత్య చేసినందుకు రెండు సార్లు ఉరి శిక్ష విధించారు.
హత్య చేసి వారి శరీరం మీద ఉన్న బంగారు నగలు లూటీ చేసినందుకు 7 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించారు. ప్రతి కేసుకు రూ. 1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని సమయంలో ప్రతి కేసులో మూడు నెలలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి సుబ్రమణియన్ సంచలన తీర్పు చెప్పారు. భవిష్యత్తులో ఎవ్వరు ఇలాంటి నేరాలకు పాల్పడని రీతిలో ఈ తీర్పు చెబుతున్నామని న్యాయమూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications