హర్యానా సిఎం పైకి బూటు: కేజ్రీ పారిపోయాడని ఖుర్షీద్
న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాపై గుర్తు తెలియని వ్యక్తి బూటు విసిరాడు. అయితే అది సిఎంకు తగలలేదు. ఆదివారం నాడు దబ్‌వాలీలోని ఓ ప్రారంభోత్సవానికి హుడా హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతుకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న పానిపట్‌లో రోడ్ షోలో పాల్గొన్న సిఎంను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్‌పై సెటైర్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధ్యక్షుడు కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలన చేతగాకే ఆయన రాజీనామా చేశాడని కొన్ని పార్టీలు అభివర్ణిస్తే, కేంద్ర మంత్రి ఖుర్షిద్ అయితే ఆయన్ని పారిపోయిన పెళ్లి కొడుకుగా యెద్దేవా చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రాకపోయినా కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని, అంతేకాకుండా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను వరకట్నంగా ఇచ్చిందన్నారు. అయినా పెళ్లి కొడుకు పారిపోతే తామేం చేయగలమని వ్యంగ్యోక్తులు విసిరారు. జన్ లోక్‌పాల్ బిల్లును అడ్డుకునేందుకు బిజెపితో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందన్న ఆరోపణలను ఖుర్షిద్ తిరస్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే అన్ని పార్టీలు ఏకమయ్యాయని అన్నారు.
కేజ్రీవాల్ బాధ్యతల నుంచి పారిపోయారని, ఏకపక్షంగా రాజీనామా చేసి ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాడని మరో కేంద్ర మంత్రి, ఎన్‌సిపి నాయకుడు తారిక్ అన్వర్ అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లుపై కేజ్రీవాల్ రాజీనామా చేయడం తొందరపాటు చర్య అని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. రాజీనామా చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన జన్ లోక్‌పాల్ సాకుగా ఎంచుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications